Page Loader
క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ
ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మ

క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత కష్టపడి పైకొచ్చాడో చాలామందికి తెలియదు. రోహిత్‌శర్మ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు. ఒకానొక దశలో క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లను అమ్మిన రోహిత్, టీమిండియా కెప్టెన్‌గా ఎదగడం ఎంతో గర్వంగా ఉందని మాజీ స్పిన్నర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా తెలిపారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన రోహిత్‌శర్మ‌కు కెరీర్ ప్రారంభంలో క్రికెట్ కిట్ కొనేందుకు కూడా డబ్బులు లేవని జియో సినిమాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓజా చెప్పాడు. ఐపీఎల్ ఆరంభంలో ఇద్దరు కలిసి డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరుపున 2013, 2015 సీజన్లో ఆడారు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మను చూస్తే గర్వంగా ఉంది

అండర్-15 నేషనల్ క్యాంపులో తొలిసారి రోహిత్ శర్మను కలిశానని, ఎవరితోనూ అతను మాట్లాడేవాడు కాదని, ఆడేటప్పుడు మాత్రం దూకుడుగా ఉండేవాడని, కొన్నేళ్ల తర్వాత తమ ఇద్దరి స్నేహం మొదలైందని ఓజా తెలిపారు. రోహిత్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడని, తన క్రికెట్ కిట్‌కు డబ్బు లేని సమయాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడని, ఆ కిట్ కొనడానికి పాల ప్యాకెట్లు కూడా అమ్మాడని, ఇప్పుడు అతన్ని చూస్తే చాలా గర్వంగా ఉందని ఓజా వివరించారు. అండర్ 19 స్థాయిలో ఆడుతున్నప్పుడు ఒత్తిడికి గురైనప్పుడల్లా రోహిత్ తన చర్యలతో నవ్వులు పూయించేవాడని చెప్పుకొచ్చాడు.