సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్
భారత క్రికెట్లో అతనోక సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతడికి మాత్రమే సొంతం. ఎంతోమంది క్రికెటర్లకు అతని జీవితమే పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో అటుపోట్లు, ఎన్నో అవమానాలు, అన్నింటికి బ్యాట్ తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు. ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రికార్డుల వేటగాడు. ఆయనే భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బాస్టర్ సచిన్ టెండుల్కర్. నేడు ఆయన 50వ జన్మదినం. సచిన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి 9ఏళ్లు అయినా.. ఆయన సాధించిన రికార్డులెన్నో ఇంకా ఫ్యాన్స్ మదిలో గుర్తిండిపోయాయి.
16ఏళ్ల వయస్సులో పాకిస్తాన్ పై మ్యాచ్ ఆడిన సచిన్
1989, నవంబర్ 15న అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్.. పదహారేళ్ల వయస్సులోనే పాకిస్థాన్ అగ్రశేణి పాస్ట్ బౌలర్లని సమర్ధంగా ఎదుర్కొన్నాడు. అనతి కాలంలోనే బ్రాడ్ మాన్ లాంటి దిగ్గజాల సరసన సచిన్ చేరిపోయాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 200 టెస్టులాడిన సచిన్ టెండుల్కర్ 53.79 సగటుతో 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం. వన్డే క్రికెట్ లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించిన వ్యక్తి సచిన్ టెండుల్కరే. 2010లో దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ చేసి రికార్డుకెక్కాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు బాదిన సచిన్
క్రికెట్ చరిత్రలో 100 అంతర్జాతీయ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ గా సచిన్ కొనసాగుతున్నాడు. సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండుల్కర్. 1973లో సచిన్ జన్మించాడు. అతని తండ్రి రమేష్ టెండుల్కర్ ఓ ప్రముఖ మరాఠీ నవలాకారుడు. సచిన్ అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచ కప్ టోర్నీలో ఆడగా.. చివరి టోర్నిలో వరల్డ్ కప్ కల నెరవేరిన విషయం తెలిసిందే. చివరిసారిగా నవంబర్ 2013లో సచిన్ తన చివరి మ్యాచ్ ను వెస్టిండీస్ పై ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ తన 200వ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్ లో ముంబై తరుపున 79 మ్యాచ్ లు ఆడిన సచిన్ 2334 పరుగులు చేశాడు. ఇందులో 50 అర్ధ సెంచరీలున్నాయి.