Sachin: సచిన్ బ్రాండ్ విలువ రూ.1,200 కోట్లు.. రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని 'మాస్టర్' హవా!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పి సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ అభిమానుల్లో ఆయనకున్న ఆదరణ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఆటకు దూరమైనా.. బ్రాండ్ విలువ విషయంలో మాత్రం సచిన్ ఇప్పటికీ దేశంలోని అగ్రశ్రేణి సెలబ్రిటీలతో పోటీపడుతున్నారు. తాజాగా విడుదలైన 'క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025' నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ 125.9 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,201 కోట్లుగా నమోదైంది. ఈ విలువతో ఆయన దేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్లలో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. ప్రతి ఏడాది ఆయన బ్రాండ్ విలువలో వృద్ధి కనిపిస్తుండటం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.
వివరాలు
అసాధారణ రికార్డులు ఆయనకే సొంతం..
సచిన్ టెండూల్కర్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకం, ఆయనకున్న విశ్వసనీయత, దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరు ప్రఖ్యాతులే ఇంతటి బ్రాండ్ విలువకు ప్రధాన కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మైదానంలోనే కాకుండా వ్యక్తిగత ప్రతిష్ఠ విషయంలోనూ సచిన్ సంపాదించుకున్న విశ్వాసం కారణంగా.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఇప్పటికీ ఆయనతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే 'గాడ్ ఆఫ్ క్రికెట్', 'మాస్టర్ బ్లాస్టర్' అనే పేర్లు సచిన్‌కు ఊరికే రాలేదు.
క్రికెట్ మైదానంలో ఆయన నెలకొల్పిన అసాధారణ రికార్డులే ఈ స్థాయి బ్రాండ్ ఇమేజ్‌కు బలమైన పునాది.
వివరాలు
టెస్టుల్లోనూ అరుదైన రికార్డులు..
తన తరంలో అత్యంత సంపూర్ణమైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 34,357 పరుగులు సాధించారు.
దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆయన చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు.
టెస్ట్ క్రికెట్‌లో సచిన్ పేరిట అనేక అరుదైన రికార్డులు ఉన్నాయి.
ఏకంగా 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్గా ఆయన రికార్డు సృష్టించారు.
ఈ ఫార్మాట్‌లో సచిన్ 15,921 పరుగులు, 51 సెంచరీలు నమోదు చేశారు.
అంతేకాదు.. కేవలం 300 ఇన్నింగ్స్‌ల్లోనే 15,000 పరుగుల మార్క్‌ను అందుకున్న అత్యంత వేగవంతమైన ఆటగాడి ఘనత కూడా సచిన్‌కే దక్కింది.