Cricketer Love Story: ఆట కంటే లవ్ స్టోరీ వైరల్.. రిజ్వీ చుట్టూ తిరుగుతున్న రూమర్లు
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రేమకథలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు అభిమానులు వారి ఆట కంటే ఈ విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం అలాంటి ఒక వార్త నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున యువ ఆల్‌రౌండర్ సమీర్ రిజ్వీ మంచి స్థిరత్వంతో ఆడుతున్నాడు. అయితే, మైదానంలోని ప్రదర్శనకన్నా బయట ఒక వివాదం కారణంగా ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.
వివరాలు
వివాదానికి కారణమైన పోస్ట్..
ప్రసిద్ధ ఇండో-కెనడియన్ స్పోర్ట్స్ యాంకర్ యేషా సాగర్‌తో రిజ్వీ ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వయసు విషయానికి వస్తే, రిజ్వీకి 22 ఏళ్లు కాగా, యేషా సాగర్‌కు 29 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ముస్లిం క్రికెటర్, లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న ఒక హిందూ యాంకర్‌తో సంబంధం కొనసాగిస్తున్నాడని, అయితే ఆ సంబంధంలో వ్యక్తిగత, మతపరమైన అంశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నాయని ఒక జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్టు ఈ చర్చకు కారణమైంది.
వివరాలు
ఆ ఆరోపణలపై స్పందించని రిజ్వీ, యేషా
ఆ జర్నలిస్ట్ ఎవరినీ నేరుగా పేర్లు చెప్పకపోయినా, యాంకర్ స్నేహితురాలి ద్వారా తెలిసిన సమాచారం అని పేర్కొంటూ కొన్ని విషయాలను వెల్లడించారు. ఆ క్రికెటర్ తన వ్యక్తిగత అభిరుచులను యాంకర్‌పై రుద్దుతున్నాడని, ఆమె సోషల్ మీడియా ప్రవర్తనపై, ఇతరులతో సంబంధాలపై కూడా కొన్ని పరిమితులు విధించాడని ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఈ సంబంధం పరస్పర అంగీకారంతోనే కొనసాగుతుందా లేదా అన్నది సంబంధిత వ్యక్తులు స్పందిస్తేనే స్పష్టమవుతుందని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అలాగే, సమీర్ రిజ్వీ గానీ, యేషా సాగర్ గానీ ఈ విషయంపై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
వివరాలు
రిజ్వీపై ప్రభావం చూపనున్న రూమర్లు..
ఇక క్రికెట్ విషయానికి వస్తే, సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 149.28 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధశతకాల సహాయంతో 209 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2024లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతను, మొత్తం 21 మ్యాచ్‌లలో 381 పరుగులు నమోదు చేశాడు. మే 1న జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు సిద్ధమవుతోంది. ఈ రూమర్లు రిజ్వీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ కేవలం సోషల్ మీడియా ప్రచారాలపైనే ఆధారపడినందున, నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలంటే మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.