Loading...
AB de Villiers: శాండ్‌పేపర్‌ గేట్‌ వివాదం.. ఉస్మాన్ ఖవాజాకు ఏబీ డివిలియర్స్‌ మద్దతు
శాండ్‌పేపర్‌ గేట్‌ వివాదం.. ఉస్మాన్ ఖవాజాకు ఏబీ డివిలియర్స్‌ మద్దతు

AB de Villiers: శాండ్‌పేపర్‌ గేట్‌ వివాదం.. ఉస్మాన్ ఖవాజాకు ఏబీ డివిలియర్స్‌ మద్దతు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

'శాండ్‌పేపర్‌ గేట్‌' వివాదంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ మద్దతు పలికాడు. బాల్‌ టాంపరింగ్‌ వ్యవహారం గురించి ఆసీస్‌ జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించిన ఏబీడీ.. అప్పట్లో జరిగిన ఘటనపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. 2018లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. బంతి ఆకారాన్ని మార్చేందుకు స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌తో కలిసి కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ శాండ్‌పేపర్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురిపై అప్పట్లో చర్యలు తీసుకున్నారు.

వివరాలు

పోర్ట్‌ ఎలిజబెత్‌లోనే జరిగిందనుకోవద్దు..

ఈ వివాదంపై ఏబీ డివిలియర్స్‌ మాట్లాడుతూ.. ''నేను ఇప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం లేదు. ఒకరు సరైనవారని, మరొకరు తప్పు చేశారని చెప్పడం లేదు.

నాకు బలంగా నమ్మకం ఉన్న విషయాలనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఉస్మాన్ ఖవాజా తన పుస్తకాన్ని విడుదల చేయడంలో తప్పేమీ లేదు.

ఈ కుంభకోణంలో భాగమైన వారందరికీ ఇది వ్యక్తిగత విషయంగా మారిపోయింది. అది ఒక్కసారే జరిగిందా? అంతకుముందు ఎన్ని మ్యాచ్‌ల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయో ఎవరికి తెలుసు? బాల్‌ టాంపరింగ్‌ కేవలం పోర్ట్‌ ఎలిజబెత్‌ మైదానంలోనే జరిగిందని భావించడం పొరపాటు.

డర్బన్‌లోనూ జరిగి ఉండొచ్చు. మ్యాచ్‌ ఫుటేజీని మరోసారి స్పష్టంగా పరిశీలించాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఏబీడీ పేర్కొన్నాడు.

వివరాలు

జట్టులోని అందరికీ తెలుసు..

ప్రస్తుతం ఈ వివాదంపై జరుగుతున్న చర్చను చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. 'మీకు శాండ్‌పేపర్‌ గురించి తెలుసా?' అంటూ జట్టులోని మిగతా ఆటగాళ్లను ప్రశ్నిస్తున్నారు.

కానీ, హద్దులు దాటి చట్టవిరుద్ధమైన పని చేయబోతున్నారనే విషయం జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసన్న అంశాన్ని అందరూ విస్మరిస్తున్నారని డివిలియర్స్‌ వెల్లడించాడు.

ADVERTISEMENT