India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ వారంలోనే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ భారత టెస్టు జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ ప్రస్తుతం సెలెక్టర్లకు ప్రధాన ఆందోళనగా మారింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న సుందర్ పూర్తి స్థాయిలో కోలుకుని సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సుందర్ అందుబాటులో లేకపోతే అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో కొత్త ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
బుమ్రా తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం..
ఇదిలా ఉంటే సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
వీరిద్దరి రాకతో భారత బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది. అలాగే గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, సౌరభ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు జట్టు కూర్పులో నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది.
అతడిని ఆల్‌రౌండర్‌గా తీసుకుంటారా లేదా అదనపు స్పెషలిస్ట్ బ్యాటర్‌కు అవకాశం కల్పిస్తారా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వివరాలు
సారాంశ్ జైన్ దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడైన ప్రదర్శన..
వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు దూరమైతే అతని స్థానంలో సారాంశ్ జైన్‌కు అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
33 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ ఇటీవల శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ 'ఎ' తరఫున ఏడు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు.
అంతేకాదు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటింగ్ చేయగల సామర్థ్యమూ అతనికి ఉంది.
సారాంశ్ జైన్ దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.
ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2,223 పరుగులు, 47 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 553 పరుగులు, 21 టీ20 మ్యాచ్‌ల్లో 37 పరుగులు నమోదు చేశాడు.
బౌలింగ్‌లో వరుసగా ఫస్ట్‌క్లాస్‌లో 188, లిస్ట్-ఏలో 38, టీ20ల్లో 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
శ్రీలంక పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లు ప్రత్యేకంగా సాధన..
బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్‌లకు జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొననుంది.
ఈ శిబిరంలో శ్రీలంక పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లు ప్రత్యేకంగా సాధన చేయనున్నారు.
అనంతరం జట్టు శ్రీలంకకు చేరుకుని టెస్టు సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక పరంగా ఈ సిరీస్ భారత్‌తో పాటు శ్రీలంకకు కూడా అత్యంత కీలకంగా మారనుంది.
అందుకే బలమైన జట్టును ఎంపిక చేయడంపై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు.