Sarfaraz Khan : వాట్ ఏ కమ్‌బ్యాక్ డ్యూడ్.. 17 కిలోలు తగ్గి టీమిండియాలోకి సర్ఫరాజ్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ తిరిగి రావడం ఆయన పట్టుదల, కఠోర శ్రమకు దక్కిన ప్రతిఫలంగా నిలిచింది. ''నేను జట్టుకు సరిపోకపోవచ్చు.. కానీ నా ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉండదు'' అంటూ గతంలో సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు తగ్గట్టుగానే ఆయన పరిస్థితులను అధిగమించి మరోసారి టీమిండియాలో చోటు సంపాదించారు. ఆస్ట్రేలియా సహా పలు సిరీస్‌ల్లో సాయి సుదర్శన్ గాయపడటంతో.. రెండేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో అవకాశం లభించింది.
వివరాలు
17 కిలోలు తగ్గి.. ఫిట్‌నెస్‌పై ఫోకస్
తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి సర్ఫరాజ్ తీవ్రంగా శ్రమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన ఫిట్‌నెస్ సాధించేందుకు గత ఏడాదిన్నరలో ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు.
రంజీ ట్రోఫీలో త్రిశతకం బాదినప్పటికీ.. శరీరాకృతిపై విమర్శలు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
టీ20, టెస్టు క్రికెట్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ముంబయిలో వర్షాల కారణంగా సాధనకు ఇబ్బందులు ఎదురవడంతో కశ్మీర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు.
వివరాలు
అవకాశాలు వచ్చినా.. ఎంపిక దక్కలేదు
2024లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా మొత్తం విఫలమైనప్పటికీ సర్ఫరాజ్‌పైనే వేటు పడింది.
ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు.. ఇంగ్లాండ్ లయన్స్‌పై 92 పరుగులు సాధించినా సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టారు.
దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపించినప్పటికీ సెలెక్టర్లు మాత్రం అతడివైపు మొగ్గుచూపలేదు.
వివరాలు
శ్రీలంకలో తుది జట్టులో చోటు దక్కేనా?
ప్రస్తుతం సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్‌కు అవకాశం లభించింది. రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్‌లతో పోలిస్తే పేస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం సర్ఫరాజ్‌కు ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.
మరోవైపు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధ్రువ్ జురెల్ ఇటీవల ఇబ్బందులు పడుతుండటం కూడా సర్ఫరాజ్‌కు కలిసొచ్చే అంశంగా మారింది.
ముఖ్యంగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లలో సర్ఫరాజ్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో శ్రీలంకలోని గాలె వేదికగా జరగనున్న తొలి టెస్టులోనే అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎట్టకేలకు ఎంతో శ్రమించి టీమిండియాలోకి తిరిగి వచ్చిన సర్ఫరాజ్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.