Thailand open: థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్‌కు సాత్విక్ - చిరాగ్ జోడీ
ఈ వార్తాకథనం ఏంటి
సాత్విక్ సాయిరాజ్- చిరాగ్‌శెట్టి జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. సెమీఫైనల్లో మలేషియాకు చెందిన గో జెఫీ - నూర్ ఇజ్జుద్దీన్ జంటపై 19-21, 22-20, 21-16 స్కోరుతో విజయం సాధించిన భారత ద్వయం ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ సీజన్‌లో వీరు చేరిన తొలి ఫైనల్ ఇదే కావడం విశేషం.
వివరాలు
థాయ్‌లాండ్ ఓపెన్‌లో మరోసారి అద్భుత ప్రదర్శన..
మ్యాచ్ ప్రారంభంలో మలేషియా జోడీ మెరుగైన ఆటతో తొలి సెట్‌ను 21-19 తేడాతో గెలుచుకుంది. అయితే ఆ తర్వాత భారత జంట గట్టిగా పోరాడుతూ రెండో సెట్‌ను 22-20తో దక్కించుకుంది. మూడో సెట్‌లో రెండు జట్లూ సమానంగా పోటీ పడినా, చివర్లో సాత్విక్ - చిరాగ్ జోడీ ఆధిపత్యం చాటుతూ 21-16తో సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన థామస్ కప్‌లో కూడా సాత్విక్ - చిరాగ్ జోడీ పతకం సాధించింది. అయితే ఆ విజయానికి తగిన గుర్తింపు లభించలేదని ఇటీవల సాత్విక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు థాయ్‌లాండ్ ఓపెన్‌లో మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.