LOADING...
PCB: ఓ క్రికెటర్‌ని పంపండి.. ట్రోఫీని అందిస్తాం.. బీసీసీఐకి పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ కౌంటర్
ఓ క్రికెటర్‌ని పంపండి.. ట్రోఫీని అందిస్తాం.. బీసీసీఐకి పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ కౌంటర్

PCB: ఓ క్రికెటర్‌ని పంపండి.. ట్రోఫీని అందిస్తాం.. బీసీసీఐకి పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ కౌంటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 ముగిసి దాదాపు నెల గడిచినా, విజేత టీమిండియా చెంతకు ట్రోఫీ ఇంకా రాలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌ మరియు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఇప్పటికీ ట్రోఫీని తన వద్దే ఉంచుకున్నాడు. సెప్టెంబర్‌లో జరిగిన ఫైనల్లో భారత్ టైటిల్‌ను గెలుచుకున్నా, ట్రోఫీ ప్రదానోత్సవ సమయంలో భారత జట్టు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఈ పరిణామం అంతా ప్రపంచ క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అప్పుడు ట్రోఫీతో పాటు మెడల్స్‌ను కూడా నఖ్వీ హోటల్‌కి తీసుకెళ్లాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది తర్వాత ట్రోఫీని భారత్‌కు పంపుతాడని భావించినా, ఇప్పటికీ ఏ మార్పు లేదు.

Details

వ్యంగ్యంగా స్పందించని ఏసీసీ చైర్మన్

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 30న జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ (BCCI) అధికారులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ట్రోఫీని వెంటనే భారత్‌కు అప్పగించాలని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా డిమాండ్ చేశారు. తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా స్పందిస్తూ, "ఈ విషయాన్ని వదిలేది లేదు. ఆసియా కప్ ట్రోఫీ భారత్‌కే దక్కాలి. అవసరమైతే ఈ అంశాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏసీసీ ఛైర్మన్‌ మోహ్సిన్ నఖ్వీ వ్యంగ్యంగా స్పందించారు.

Details

మా చేతుల మీదుగానే ట్రోఫీని అందిస్తాం

ఆయన లేఖలో ఇలా రాశారు. ట్రోఫీ ప్రదానోత్సవం సందర్భంగా నేను, ఇతర అధికారులు దాదాపు 40 నిమిషాలపాటు వేచి చూశాం. రాజకీయాలను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తితో కార్యక్రమం జరగాలని అనుకున్నాం, కానీ అది సాధ్యపడలేదు. భారత్ గెలిచిన ట్రోఫీ వారిదే. వారు అధికారికంగా ప్రతినిధిని పంపితే, మా చేతుల మీదుగా ట్రోఫీ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం పూర్తిగా మీడియా ముందు జరుగుతుందన్నారు. మొత్తానికి, ఆసియా కప్ ట్రోఫీ ఇప్పుడు క్రీడాస్ఫూర్తి కంటే రాజకీయ చర్చలకు ఎక్కువ కారణమవుతోంది. పీసీబీ, బీసీసీఐ మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా, విజేత జట్టుకు ట్రోఫీ ఎప్పుడు చేరుతుందనే దానిపై అభిమానుల దృష్టి నిలిచింది.