రాఫెల్ నాదల్ రికార్డును అధిగమించిన నొవాక్ జాకోవిచ్
కెరీర్ లో 23వ గ్లాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ లో బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు నొవాక్ జాకోవిచ్ ఆ దిశగా మరో ముందు అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వ ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ కు చేరగా.. ప్రస్తుతం జాకొవిచ్ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకువెళ్లడం విశేషం. ఆదివారం జరిగిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 6-2, 6-2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై విజయం సాధించాడు.
క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ తో తలపడనున్న జొకోవిచ్
మ్యాచ్ విషయానికొస్తే.. ఇందులో జాకోవిచ్ ఏడు ఎస్ సంధించాడు. అదే విధంగా ప్రత్యర్థి సర్వీస్ ను ఆరు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. మొత్తంగా గ్రాండ్ స్లామ్ టోర్నీలో అత్యధిసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్(58సార్లు) పేరిట ఉంది. జాకొవిచ్ (55సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్(41) సార్లు నాలుగో స్థానంలో నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ తలపడనున్నాడు.