LOADING...
Serena Williams: నాలుగేళ్ల తర్వాత కోర్టులోకి సెరెనా.. వింబుల్డన్‌లో వైల్డ్ కార్డుతో గ్రాండ్ రీఎంట్రీ!
నాలుగేళ్ల తర్వాత కోర్టులోకి సెరెనా.. వింబుల్డన్‌లో వైల్డ్ కార్డుతో గ్రాండ్ రీఎంట్రీ!

Serena Williams: నాలుగేళ్ల తర్వాత కోర్టులోకి సెరెనా.. వింబుల్డన్‌లో వైల్డ్ కార్డుతో గ్రాండ్ రీఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి టెన్నిస్ కోర్టులో సందడి చేయడానికి సిద్ధమైంది. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ ప్లేయర్, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో పునరాగమనం చేయనుంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న 2026 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా పోటీ పడనుండగా, నిర్వాహకులు ఆమెకు వైల్డ్ కార్డు ఎంట్రీ మంజూరు చేశారు. సెరెనా పునరాగమనాన్ని అధికారికంగా ప్రకటిస్తూ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టు చేసింది. "ఇది డ్రిల్ కాదు.. 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీతో సెరెనా విలియమ్స్ పోటీ పడనుందంటూ ఆమె ఫొటోను పంచుకుంది.

వివరాలు

టెన్నిస్ అభిమానుల్లో ఉత్సాహం

ఈ ప్రకటనతో టెన్నిస్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక సెరెనా సోదరి వీనస్ విలియమ్స్‌కు కూడా వింబుల్డన్ డబుల్స్ విభాగంలో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. దీంతో విలియమ్స్ సిస్టర్స్ మరోసారి గ్రాండ్‌స్లామ్ వేదికపై కనిపించనున్న అవకాశం అభిమానులను ఆకట్టుకుంటోంది. సెరెనా విలియమ్స్ చివరిసారిగా 2022 యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగింది. ఆ టోర్నీ అనంతరం ఆమె ఏ గ్రాండ్‌స్లామ్‌లోనూ పాల్గొనకుండా ఆటకు దూరమైంది. అయితే ఇటీవల మళ్లీ కోర్టులోకి అడుగుపెడుతూ గత వారం క్వీన్స్ టోర్నీలో కెనడాకు చెందిన టీనేజర్ విక్టోరియా ఎబాకోతో కలిసి డబుల్స్ విభాగంలో పోటీ పడింది.

వివరాలు

నాలుగేళ్ల విరామం తర్వాత ఆడిన తొలి మ్యాచ్

నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె ఆడిన తొలి మ్యాచ్ అదే కావడం విశేషం. అయితే మూడో సీడ్ జోడీ నికోలె మెలిచర్ మార్టినెజ్ - రౌటిఫ్ చేతిలో 7-6 (7/2), 6-2 తేడాతో ఓటమి పాలైంది. అనంతరం ఈ వారంలో జరిగిన బెర్లిన్ ఓపెన్‌లో చెక్ పార్టనర్ కరోలినాతో కలిసి సెరెనా మరోసారి డబుల్స్ బరిలోకి దిగింది. అయితే అక్కడ కూడా తొలి రౌండ్‌లోనే రౌటిఫ్ - ఓల్మోస్ జోడీ చేతిలో 6-4, 6-4 తేడాతో పరాజయం చవిచూసింది. అయినప్పటికీ వింబుల్డన్‌లో సెరెనా విలియమ్స్ పునరాగమనం ఇప్పుడు ప్రపంచ టెన్నిస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె సింగిల్స్‌లో ఎలా రాణిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Advertisement