LOADING...
IND vs NZ: టీమిండియాకు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ ఔట్‌, బడోని ఇన్‌!
టీమిండియాకు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ ఔట్‌, బడోని ఇన్‌!

IND vs NZ: టీమిండియాకు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ ఔట్‌, బడోని ఇన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, న్యూజిలాండ్‌ (IND vs NZ) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో దిల్లీకి చెందిన యువ బ్యాటర్‌ ఆయుష్‌ బడోని (Ayush Badoni)ని భారత జట్టులోకి ఎంపిక చేశారు. 26 ఏళ్ల బడోనికి వన్డే జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదివారం వడోదర వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో సుందర్‌ బరిలోకి దిగాడు. అయితే బౌలింగ్‌ చేస్తుండగా పక్కటెముకల వద్ద తీవ్ర నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ కారణంగా కేవలం ఐదు ఓవర్లకే పరిమితమయ్యాడు. బ్యాటింగ్‌ సమయంలోనూ వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో అసౌకర్యంగా కనిపించాడు.

Details

మిగిలిన రెండు వన్డేలకు దూరం

పరిస్థితి తీవ్రతను గమనించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిని సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలకు దూరం పెట్టాలని నిర్ణయించింది. సుందర్‌ గాయం తీవ్రతను నిర్ధారించేందుకు త్వరలో స్కానింగ్‌ చేయనున్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత వైద్యుల సూచనల మేరకు న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతడిని ఆడించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, సుందర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుష్‌ బడోని లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మంచి రికార్డే కలిగి ఉన్నాడు. దిల్లీ తరఫున ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడిన బడోని 693 పరుగులు చేయడంతో పాటు 18 వికెట్లు కూడా సాధించాడు. ఈ ప్రదర్శనలే అతడికి జాతీయ జట్టులో అవకాశాన్ని తెచ్చిపెట్టాయి.

Details

 న్యూజిలాండ్‌తో రెండో, మూడో వన్డేలకు భారత జట్టు ఇదే

వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్‌లో, మూడో వన్డే జనవరి 18న ఇందౌర్‌లో జరగనుంది. శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, హర్షిత్‌ రాణా ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అర్ష్‌దీప్‌ సింగ్‌, యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌కీపర్‌), ఆయుష్‌ బడోని.

Advertisement