Kerala: కేరళలో దళిత క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు.. 44 మంది అరెస్టులు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక హింసకు పాల్పడ్డ ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది, ఇంతవరకు 44 మంది నిందితులను అరెస్టు చేసింది. బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత 30 ఎఫ్‌ఐఆర్లను నమోదు చేసినట్లు డీఐజీ ఎస్ అజీతా బేగం తెలిపారు.
నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నారని, వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నామని, ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు.
సిట్ ఆధారాలతో శాస్త్రీయ విచారణ కొనసాగిస్తూ, ఇంకా 13 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి కోసం వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
Details
భయంతో విషయాన్ని బయటపెట్టలేకపోయిన బాధితురాలు
విచారణలో బాధితురాలు పలువురు నిందితులతో పథనంథిట్టలోని ఓ ప్రైవేటు బస్టాండులో కలిసినట్లు వెల్లడైంది.
బాధితురాలిని వాహనాల్లో ఎక్కించుకుని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించారని పోలీసులు గుర్తించారు.
గతేడాది ఆమె 12వ తరగతి చదువుతున్నప్పుడు ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ యువకుడు ఆమెను ఓ రబ్బరు తోటలోకి తీసుకెళ్లి, ఇతర నిందితులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
ఈ బాధితురాలికి ప్రస్తుతం 18 ఏళ్లు, ఐదేళ్లుగా ఆమె అనేక దారుణాలను అనుభవించిందన్నారు. ఇన్నాళ్లూ భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయినట్లు పేర్కొంది.
ఈ కేసులో సిట్ 30 మంది అధికారులతో విచారణను కొనసాగిస్తూ, మరికొందరు అధికారులను విచారణ కమిటీలో చేరుస్తామని డీఐజీ అజీతా బేగం తెలిపారు.