Harmanpreet Kaur: ఆమెకు ప్రత్యేక పాత్ర ఉంది.. రిచా ఘోష్ బ్యాటింగ్‌కు హర్మన్‌ప్రీత్ ఫిదా!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత మహిళల జట్టు విజయవంతంగా తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో 106పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేస్తూ భారత అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. "ముందుగా భారత అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీరు ఎప్పుడూ మాకు అండగా నిలుస్తున్నారు.
వివరాలు
అభిమానుల మద్దతు ప్రత్యేకం
మీ మద్దతు మా జట్టుకు ఎంతో విలువైనది. అందుకే ఈ విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తున్నానని పేర్కొంది. జట్టుకు అవసరమైన సమయంలో సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం ఎంతో ముఖ్యమని హర్మన్‌ప్రీత్ తెలిపింది. "స్మృతి మంధాన, దీప్తి శర్మలు జట్టుకు అవసరమైన ప్రతిసారీ ముందుకొచ్చి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్‌లో కూడా వారు అద్భుతంగా ఆడారు. వారి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఆరంభంలో తాము తమపై ఒత్తిడి పెంచుకున్నామని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. తర్వాత నేను, స్మృతి కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాం. అనుకున్న స్కోరును సాధించగలిగామని తెలిపింది. భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌పై హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
వివరాలు
రిచా ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం
"నా చేతిలో ఉంటే రిచాను మొదటి బంతికే బ్యాటింగ్‌కు పంపిస్తాను. అయితే జట్టులో ఆమెకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆ బాధ్యతను ఆమె అద్భుతంగా నిర్వర్తిస్తోంది. ఈరోజు రిచా ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఫీల్డింగ్‌లో ఆరంభంలో కొన్ని చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ, తర్వాత జట్టు అద్భుతంగా పుంజుకుందని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. "క్రికెట్‌లో క్యాచ్‌లు చాలా కీలకం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం సులభమవుతుంది. మేము ప్రతి బంతికి పూర్తి నిబద్ధతతో ఆడాలని భావించాం. ఫీల్డింగ్‌లో జట్టు చూపిన అంకితభావం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపింది.
వివరాలు
తన
టోర్నీలో ప్రతి లీగ్ మ్యాచ్ ఎంతో కీలకమని, భారీ విజయాలు నెట్ రన్‌రేట్ పరంగా కూడా ప్రయోజనకరమని ఆమె వివరించింది. "టోర్నీ చివరి దశలో నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మ్యాచ్‌లో భారీ విజయాలు సాధించడం ముఖ్యమని చెప్పింది. మ్యాచ్ ముగిసే సమయానికి హర్మన్‌ప్రీత్ కొంత ఇబ్బందిగా నడుస్తూ కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్యంపై స్పందిస్తూ "నేను పూర్తిగా బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.