Loading...
West Indies: టీ20ల్లో జోష్.. వన్డేల్లో ఫెయిల్! విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్!
టీ20ల్లో జోష్.. వన్డేల్లో ఫెయిల్! విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్!

West Indies: టీ20ల్లో జోష్.. వన్డేల్లో ఫెయిల్! విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ వరుసగా నిరాశపరుస్తోంది. టీ20 క్రికెట్‌కు అలవాటు పడిన విండీస్ బ్యాటర్లు వన్డే ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆడలేక తడబడుతున్నారు. భారీ షాట్లపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో నిలకడైన ఇన్నింగ్స్ నిర్మించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా తొలి వన్డే తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వెస్టిండీస్ 150 పరుగుల లోపే ఆలౌట్ కావడం వారి పేలవ ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది. ఈ క్రమంలో గయానా వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ బౌలర్ జేడన్ లెనోక్స్ మరోసారి అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

వివరాలు

వరుసగా విఫలమవుతున్న విండీస్ ప్లేయర్లు

టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో కేవలం 140 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్లలో కీసీ కార్టి 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, షిమ్రోన్ హెట్‌మైర్ 26 పరుగులు చేసి కాస్త పోరాడాడు.

మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేడన్ లెనోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు.

మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ తలో రెండు వికెట్లు సాధించి మంచి సహకారం అందించారు.

141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

డారిల్ మిచెల్ 28 పరుగులు, హెన్రీ నికోల్స్ 24 పరుగులతో జట్టుకు శుభారంభం అందించారు.

వివరాలు

ఆధిక్యంలో న్యూజిలాండ్

అనంతరం టామ్ లాథమ్ 31 పరుగులతో అజేయంగా నిలవగా, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

వెస్టిండీస్ బౌలర్లలో విటెల్ లాస్ మూడు వికెట్లు తీశాడు. కేరీ పియర్రీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది.

ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జూలై 19 (ఆదివారం)న బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరగనుంది.

ADVERTISEMENT