LOADING...
P.V. Sindhu: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సింధుకు షాక్‌.. సెమీస్‌లో యమగుచి చేతిలో పరాజయం
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సింధుకు షాక్‌.. సెమీస్‌లో యమగుచి చేతిలో పరాజయం

P.V. Sindhu: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సింధుకు షాక్‌.. సెమీస్‌లో యమగుచి చేతిలో పరాజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవాలన్న భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఆశలు మరోసారి అర్ధాంతరంగా ముగిశాయి. ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీ ఫైనల్‌ వరకు అద్భుత ప్రదర్శన కనబర్చిన సింధు.. కీలక పోరులో టాప్‌ సీడ్‌, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ యమగుచి (జపాన్‌) చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యమగుచి 22-20, 21-12 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లగా.. సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో సింధు చాలా సమయం ఆధిక్యంలో కొనసాగింది. అయితే యమగుచి పట్టువదలకుండా పోరాడి స్కోరును 20-20తో సమం చేసింది.

వివరాలు

రెండో గేమ్‌లో 21-12 తేడాతో ఓటమి

ఆ తర్వాత వరుసగా రెండు కీలక పాయింట్లు సాధించిన జపాన్‌ స్టార్‌ తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. మొదటి గేమ్‌లో ఎదురైన నిరాశ నుంచి కోలుకోలేకపోయిన సింధు.. రెండో గేమ్‌లో యమగుచి దూకుడును అడ్డుకోలేకపోయింది. అద్భుత ఆటతీరును కొనసాగించిన జపాన్‌ క్రీడాకారిణి 21-12తో రెండో గేమ్‌ను కూడా సునాయసంగా గెలుచుకుని మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న పి.వి. సింధుకు మరోసారి నిరాశ తప్పలేదు. సెమీ ఫైనల్‌ దశలోనే ఆమె ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీకి వీడ్కోలు పలికింది.

Advertisement