LOADING...
Kane Williamson: అభిమానులకు షాక్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు
అభిమానులకు షాక్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు

Kane Williamson: అభిమానులకు షాక్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విలియమ్సన్ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కొద్ది నెలల ముందు ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడం కివీస్ అభిమానులను నిరాశకు గురి చేసింది.

Details

అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు

13 ఏళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో విలియమ్సన్‌ 93 మ్యాచ్‌లు ఆడి 33 సగటుతో 2,575 పరుగులు సాధించాడు. ఇందులో 18 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20ల్లో న్యూజిలాండ్‌ తరఫున రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆయన నిలిచాడు. అదనంగా, 75 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి, రెండు సార్లు (2016, 2022) జట్టును సెమీఫైనల్స్‌కు, ఒకసారి (2021) ఫైనల్‌కు చేర్చిన ఘనత విలియమ్సన్‌దే.

Details

యువ ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలి

తన రిటైర్మెంట్‌పై విలియమ్సన్‌ మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడటం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, నాకూ, జట్టుకూ ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టుకు స్పష్టత ఇవ్వాలనుకున్నాను. జట్టులో ఉన్న యువ ప్రతిభావంతుల ఆటగాళ్లకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలి. మిచ్‌ (సాంట్నర్‌) అద్భుతమైన నాయకుడు. ఇకపై జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత వారిదే. నేను ఎప్పుడూ బయట నుంచి మద్దతు ఇస్తానని పేర్కొన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో డిసెంబర్‌లో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌పైనే దృష్టి పెట్టినట్లు విలియమ్సన్‌ తెలిపాడు.

Details

టీ20 ఫ్రాంచైజీ లీగ్ లో కొనసాగుతానని స్పష్టం

అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో తాను కొనసాగుతానని స్పష్టం చేశాడు. విలియమ్సన్‌ నిర్ణయంపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ సీఈఓ స్కాట్‌ వీనింక్‌ స్పందిస్తూ, "టీ20 జట్టుకు ఆటగాడిగా, కెప్టెన్‌గా కేన్‌ చేసిన సేవలు అమూల్యమైనవి. 2021 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో అతను ఆడిన 85 పరుగుల ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కెరీర్‌లో మిగిలిన ప్రయాణానికి న్యూజిలాండ్‌ క్రికెట్‌ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అభిప్రాయపడ్డాడు.