VHT 2024-25: శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీ..
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు భారత సెలక్టర్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ పెద్ద సవాల్‌గా మారాడు.
ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్, దేశవాళీ క్రికెట్‌లో తన అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో అయ్యర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మెరుగైన ఆటతో అదరగొడుతున్నాడు.
ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్, పుదుచ్చేరితో జరిగిన రౌండ్-6 మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో ముంబై జట్టును గట్టెక్కించాడు.
36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబై జట్టును, శ్రేయస్ కేవలం 133 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
వివరాలు
టోర్నీలో శ్రేయస్ కి ఇది రెండో సెంచరీ
అతడి ఈ ఇన్నింగ్స్ ద్వారా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేయగలిగింది.
పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ దేశీ, గౌరవ్ యాదవ్, గురువర్దన్ సింగ్,అంకిత్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇదే టోర్నీలో శ్రేయస్ కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.ఇప్పటివరకు ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన అతడు 138.66 స్ట్రైక్ రేటుతో 312 పరుగులు చేశాడు.
అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా శ్రేయస్ తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు.
ఈదేశవాళీ టోర్నీల్లో అతడి అత్యుత్తమ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని,ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశాలు చాలా ఉంటాయని స్పష్టమవుతోంది.