LOADING...
Shreyas Iyer : సిక్సర్ల పందెం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన శ్రేయస్ అయ్యర్
సిక్సర్ల పందెం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer : సిక్సర్ల పందెం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన శ్రేయస్ అయ్యర్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 20, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సిక్సర్ల పోటీనే పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటింగ్ విధ్వంసానికి కారణమని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ దుమ్మురేపింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొల్లి (87) అద్భుతంగా ఆడటంతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 54 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఇది ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లక్నో జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

వివరాలు

ఆ సీక్రెట్ చెప్పిన కెప్టెన్..

ఈ అద్భుత బ్యాటింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బయటపెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సరదాగా సిక్సర్ల పోటీ పెట్టినట్టుగా ఆయన తెలిపాడు. "నేను కూపర్, ఆర్యతో మాట్లాడాను. మనలో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారో ఒక పోటీ పెడదాం అని చెప్పాను. గెలిచిన వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తానని అన్నాను. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తే వాళ్లు అద్భుతాలు చేస్తారు. ఇదే మా జట్టు మంత్రం" అని అయ్యర్ వివరించారు.

వివరాలు

సహచరులను ప్రశంసించిన అయ్యర్..

ఈ మ్యాచ్‌లో ఆర్య, కానొల్లి ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో కనిపించారు. కేవలం 13.2 ఓవర్లలోనే రెండో వికెట్‌కు 182 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. "వాళ్లు కొట్టిన కొన్ని షాట్లు నమ్మశక్యం కానివి. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్ ఫుట్‌పై నుంచే నేరుగా బాదడం నిజంగా అద్భుతం" అని అయ్యర్ తన సహచరులను ప్రశంసించారు. అలాగే కోచ్ రికీ పాంటింగ్ జట్టుకు ఎంతో స్ఫూర్తినిస్తారని, తాను కేవలం చిన్న సూచనలు మాత్రమే ఇస్తానని, ఆటగాళ్లే బాధ్యత తీసుకుని ఆడతారని ఆయన పేర్కొన్నారు.

Advertisement