ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం
ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్నుగాయం నుంచి శ్రేయాస్ ఇంకా కోలుకోకపోవడంతో మొదటి టెస్టు నుంచి తప్పించారు. రేపటి నుంచి నాగపూర్‌లో జరిగే ట్రైనింగ్ సేషన్‌కు అతను రావడం లేదని సమాచారం. ఇదే నిజమైతే శ్రేయాస్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయ్యర్ టెస్టులో మెరుగైన ప్రదర్శనలు చేసి, టెస్టు జట్టులో చోటు సంపాదించుకున్నాడు. నాగపూర్ జరిగే టెస్టు సిరీస్‌లో శ్రేయాస్ గైర్హాజరైతే భారత జట్టుకు మిడిలార్డర్ లోపం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఇండియా కనీసం 2-0 తేడాతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో రాణించాల్సి ఉంటుంది.
రెండు వారాల పాటు విశ్రాంతి అవసరం
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ కు ముందు శ్రేయాస్ గాయంతో బాధపడ్డాడు. సిరీస్ నుంచి పక్కకు తప్పించిన బీసీసీఐ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీకి పంపింది. అయితే అతనికి ఇంకా వెన్ను తగ్గలేదని, మరో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని ఎన్సీఏ సూచించింది. అయ్యర్ టెస్ట్ కెరీర్ మెరుగ్గా ఉంది. 2021లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్ లోనే రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు చరిత్రలో అరంగేట్రంలోనే శతకం బాదిన 10వ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఏడు టెస్టుల్లో 56.73 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలున్నాయి.