ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి దూరమయ్యాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 17 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి శ్రేయాస్ అయ్యర్ దూరమైనట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ బుధవారం అధికారికంగా ప్రకటించాడు. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ మొత్తానికి కూడా శ్రేయాస్ అయ్యర్ దూరమైనట్లు తెలుస్తోంది.
శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఎవరిని భర్తి చేస్తారో..?
ఫిబ్రవరి చివర్లో గాయం నుంచి కోలుకొని అయ్యర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ.. మళ్లీ గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఒకవేళ గాయం నుంచి కోలుకున్న తర్వాత బెంగళూర్ లోని నేషనల్ అకాడమీలో శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ లో కోల్ కత్తా కెప్టెన్ గా అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. కోల్ కత్తా ఫ్రాంచైజీ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా ఎవరిని నియామకం చేస్తుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పుడు వన్డే సిరీస్‌లో అయ్యర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది.