LOADING...
Sikandar Raza: 13 ఏళ్ళ వయస్సులో సికిందర్ రజా సోదరుడు మృతి.. జింబాబ్వే కెప్టెన్ ఎమోషనల్
జింబాబ్వే కెప్టెన్ ఎమోషనల్

Sikandar Raza: 13 ఏళ్ళ వయస్సులో సికిందర్ రజా సోదరుడు మృతి.. జింబాబ్వే కెప్టెన్ ఎమోషనల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వే క్రికెట్ జట్టుకు చెందిన టీ20 కెప్టెన్, ప్రముఖ ఆల్‌రౌండర్ సికిందర్ రజా కుటుంబంలోఘోర విషాదం నెలకొంది. ఆయన చిన్న తమ్ముడు మహమ్మద్ మెహదీ (13) అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఈ అకస్మాత్తు ఘటన రజా కుటుంబంతో పాటు క్రికెట్ లోకాన్ని కూడా తీవ్రంగా కలచివేసింది. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మెహదీ పుట్టుక నుంచే హీమోఫీలియా అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2025 డిసెంబర్ 29న హరారేలో తుదిశ్వాస విడిచాడు.

వివరాలు 

ఈ కష్ట సమయంలో రజాకు అండగా ఉంటామన్న జింబాబ్వే క్రికెట్ బోర్డు 

అనంతరం డిసెంబర్ 30న హరారేలోని వారెన్ హిల్స్ శ్మశానవాటికలో మెహదీ అంత్యక్రియలు నిర్వహించినట్లు జింబాబ్వే క్రికెట్ తెలిపింది. "సికిందర్ రజా కుటుంబానికి మా గాఢ సానుభూతి. ఈ కఠిన సమయంలో బోర్డు సభ్యులు, మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు, సిబ్బంది అందరూ రజా కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తాం. మెహదీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం" అని ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద వార్తపై సికిందర్ రజా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. జింబాబ్వే క్రికెట్ బోర్డు చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ 'బ్రోకెన్ హార్ట్' ఎమోజీని షేర్ చేసి తన మనోవేదనను వ్యక్తం చేశాడు.

వివరాలు 

సోదరుడి మృతి సికిందర్ రజాను తీవ్రంగా కుంగదీసింది

ఇదిలా ఉండగా, వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండి మంచి ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో రజాను ఈ వ్యక్తిగత విషాదం తీవ్రంగా కుదిపేసింది. ఇటీవల జరిగిన ఐఎల్టీ20-2025 సీజన్‌లో షార్జా వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన ఆయన 171 పరుగులు సాధించడమే కాకుండా 10 వికెట్లు కూడా తీసి టీ20 ఫార్మాట్‌లో తన సత్తా చాటాడు. అయితే ఇలాంటి సమయంలోనే సోదరుడి మృతివార్త రావడం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా సికిందర్ రజాకు సంతాప సందేశాలు పంపిస్తూ ఆయనకు అండగా నిలుస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీమోఫీలియా సమస్యతో కన్నుమూసిన రజా తమ్ముడు మహమ్మద్ మెహదీ 

Advertisement