
World Para Athletics 2025: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో భారత్ ఉత్తమ ప్రదర్శన.. నవ్‌దీప్, ప్రీతి, సిమ్రన్‌లకు రజతాలు సందీప్‌కు కాంస్యం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో ఇప్పటివరకు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన భారత జట్టు, చివరి రోజున కూడా అద్భుతంగా రాణించింది. ఆదివారం జరిగిన తుది పోటీలలో భారత్ మరో మూడు రజత పతకాలు,ఒక కాంస్య పతకాన్ని సాధించి టోర్నీని ఘనంగా ముగించింది. ఆదివారం జరిగిన ఈవెంట్లలో జావెలిన్ త్రో విభాగంలో నవ్‌దీప్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 100మీటర్ల పరుగులో ప్రీతి పాల్ రజతం సాధించగా, 200మీటర్ల పరుగులో సిమ్రన్ శర్మ రెండో స్థానం దక్కించుకుంది. అంతేకాక,పురుషుల 200మీటర్ల టీ44 విభాగంలో సందీప్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్ 22పతకాలతో (6 స్వర్ణాలు,9 రజతాలు,7 కాంస్యాలు)పదో స్థానంలో నిలిచింది.
వివరాలు
ఎఫ్41 జావెలిన్ త్రోలో నవ్‌దీప్ కి రజతం
ఎఫ్41 జావెలిన్ త్రోలో నవ్‌దీప్ 45.46 మీటర్ల దూరం విసరడం ద్వారా రజతం సాధించాడు. మహిళల టీ35, 200 మీటర్ల రేసులో ప్రీతి పాల్ 30.03 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు టీ12, 200 మీటర్ల విభాగంలో సిమ్రన్ శర్మ 17.15 సెకన్లలో పరుగెత్తి రజత పతకాన్ని గెలిచింది. మొదట ఆమెకు కాంస్యం ప్రకటించగా, రెండో స్థానంలో నిలిచిన వెనిజువెలా అథ్లెట్ పెరిజ్ అనర్హతకు గురి కావడంతో సిమ్రన్ రజత స్థానానికి పదోన్నతి పొందింది. ఇది ప్రస్తుత టోర్నీలో సిమ్రన్‌కి రెండవ పతకం కావడం విశేషం. ఈ కంటే ముందు ఆమె టీ12, 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.
వివరాలు
44 పతకాలతో అగ్రస్థానంలో బ్రెజిల్
పురుషుల టీ44, 200 మీటర్ల రేసులో సందీప్ 18.14 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్యాన్ని గెలిచాడు. ఇక మొత్తం పతకాల పట్టికలో బ్రెజిల్ 44 పతకాలతో (15 స్వర్ణాలు, 20 రజతాలు, 9 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. చైనా 52 పతకాలతో (13 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు) రెండో స్థానంలో నిలువగా, ఇరాన్ 16 పతకాలతో (9 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు) మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత అథ్లెట్లు ఇంత అద్భుత ప్రదర్శనతో తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. ఈ సారి ప్రపంచ వేదికపై భారత జెండా ఎగరేసిన వీరుల విజయాలు దేశాన్ని గర్వపడేలా చేశాయి.