Page Loader
ENG vs IND : లార్డ్స్‌లో దూకుడుగా ప్రవర్తించిన సిరాజ్.. భారీ షాకిచ్చిన ఐసీసీ!
లార్డ్స్‌లో దూకుడుగా ప్రవర్తించిన సిరాజ్.. భారీ షాకిచ్చిన ఐసీసీ!

ENG vs IND : లార్డ్స్‌లో దూకుడుగా ప్రవర్తించిన సిరాజ్.. భారీ షాకిచ్చిన ఐసీసీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కి అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు సిరాజ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడని ప్రకటించింది. దాంతో అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాగా వసూలు చేయడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది.

Details

అసలు ఏం జరిగింది?

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా, భారత్‌ కూడా అదే స్కోరుతో సమాధానం ఇచ్చింది. ఆపై ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా, సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ (12) జస్ప్రీత్ బుమ్రా చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డకెట్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో సిరాజ్ అతడి దగ్గరికి వెళ్లి అత్యుత్సాహంగా సెలబ్రేట్ చేశాడు. ఇది ICC ప్రవర్తనా నియమావళి ప్రకారం నిబంధనలకు విరుద్ధం కావడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. ICC ప్రకారం, ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5ను సిరాజ్ ఉల్లంఘించాడు. ఇది ఔట్ అయిన బ్యాట్స్‌మన్‌ను ఉద్దేశించి అవమానకరంగా లేదా దూకుడుగా సంబరాలు చేయడాన్ని నిషేధించే నిబంధన.

Details

డీమెరిట్ పాయింట్ల ప్రాముఖ్యత

ఒక ఆటగాడి ఖాతాలో 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే, అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. రెండు సస్పెన్షన్ పాయింట్లు అంటే ఒక టెస్ట్ మ్యాచ్, లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లు ఆటకు నిషేధంగా మారుతుంది. అందువల్ల ప్రతి డీమెరిట్ పాయింట్‌కు పెద్ద ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలగా, భారత్ 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(33)ఉన్నాడు. భారత్ విజయానికి చివరి రోజు ఇంకా 135 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్‌కు 6 వికెట్లు అవసరం