SL VS AFG : త్రుటిలో చేజారిన సూపర్-4 బెర్త్.. పోరాడి ఓడిన అప్గాన్
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ చేజేతులారా ఓటమిపాలైంది. దీంతో సూపర్ 4 కు వెళ్లే ఛాన్స్ ను ఆ జట్టు మిస్ చేసుకుంది. శ్రీలంకతో ఉత్కంఠభరిత మ్యాచులో అర్హత సాధించడానికి అవకాశాలు ఉన్నా, తెలివిగా ఆడకపోవడంతో అప్గాన్ కు ఓటమి తప్పలేదు. చివరి దాకా పట్టు వదలకుండా పోరాడిన శ్రీలంక 2 పరుగుల తేడాతో గెలిచి సూపర్ 4లోకి అడుగుపెట్టింది. అఫ్గాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ బిలో ఒక మ్యాచ్ గెలిచి, మరోక మ్యాచులో ఓడిన బంగ్లాదేశ్ కూడా సూపర్ 4కు అర్హత సాధించింది.
4 వికెట్లతో చెలరేగిన గుల్బాదిన్ నైబ్
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ 92 పరుగులతో చెలరేగిపోయాడు. గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక చేధనలో అఫ్గాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు అలౌటైంది. మహ్మద్ నబీ 65 పరుగులు, హష్మతుల్లా షాహిది 59 పరుగులతో పోరాడారు. అఫ్గాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే 31 బంతుల్లో 54 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్, నజీబుల్లా జాద్రాన్ ధాటిగా ఆడి ఆశలు రేపినా ఫలితం దక్కలేదు.