Football World cup: స్పెయిన్ ప్రపంచకప్ విజయానికి స్వదేశంలో ఘన స్వాగతం.. వేడుకల్లో 20 లక్షల మంది అభిమానులు
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మాడ్రిడ్‌లో నిర్వహించిన విజయోత్సవ పరేడ్‌లో సుమారు 20 లక్షల మంది అభిమానులు పాల్గొని జట్టుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం స్పెయిన్ జట్టులోని 26 మంది ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది రాజ కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌తో సమావేశమయ్యారు.
వివరాలు
భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు..
మాడ్రిడ్‌లోని చారిత్రక మాన్‌కోలా ప్యాలెస్ నుంచి ప్రధానమంత్రి అధికార నివాసం మీదుగా సిబెల్స్ స్క్వేర్ వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ, ప్రపంచకప్ ట్రోఫీని ప్రదర్శించారు.
రహదారుల వెంట భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు జట్టును ఉత్సాహంగా అభినందించారు.
ఇక ఫైనల్లో పరాజయం పాలైన అర్జెంటీనా జట్టు కూడా స్వదేశానికి చేరుకుంది.
టైటిల్‌ను దక్కించుకోలేకపోయినా, ఆ జట్టుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
కెప్టెన్ లియోనెల్ మెస్సి నేరుగా తన నివాసానికి వెళ్లగా, మిగిలిన ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో నగర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ అభిమానులను పలకరించారు.