
IPL 2025: ఐపీఎల్-18లో యువ ఆటగాళ్లు దూకుడుపై ప్రత్యేక కథనం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 క్రికెట్ అనేది యువతకు అనుకూలంగా ఉండే ఆటగా గుర్తింపు పొందింది.
ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) అనేక ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
2025 సీజన్‌లో కూడా యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇప్పటికే తమ ప్రభావాన్ని చూపిన కొందరితో పాటు కొత్తగా మెరిసిపోతున్న యువకులు కూడా ఈ సీజన్‌లో చర్చనీయాంశంగా మారారు.
ప్రియాంశ్ ఆర్య
బ్యాటింగ్‌లో సంచలనం.. ప్రియాంశ్ ఆర్య
23ఏళ్ల ఢిల్లీ యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య,ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్‌గా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో అలరిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 39బంతుల్లోనే సెంచరీ బాదడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
తనతొలి మ్యాచ్‌లోనే 23బంతుల్లో 47పరుగులు చేసి ఐపీఎల్‌లో చక్కటి ఆరంభం ఇచ్చిన ఈ యువకుడు,తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా చెన్నైపై ఘనంగా రాణించాడు.
ఆతర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఆడాడు.ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించిన అతడు వేలంలో రూ.3.8 కోట్లు పలికాడు.
ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేసి, 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకుంటున్నాడు.
దిగ్వేశ్ సింగ్ రాఠి
నరైన్ శైలిలో స్పిన్ మాయాజాలం.. దిగ్వేశ్ సింగ్ రాఠి
వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేస్తూ నైపుణ్యం చూపిస్తున్న దిగ్వేశ్ సింగ్ రాఠి, లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన బౌలింగ్ ఆయుధంగా నిలిచాడు.
చేతిని వెనక దాచిపెట్టి బంతి వేస్తూ ఆటగాళ్లను ఆశ్చర్యపరచడం నరైన్ శైలి అయితే, దానిని ఎంతో సమర్థవంతంగా అనుసరించి దిగ్వేశ్ తనదైన ముద్ర వేసాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తున్నా అతడి ఎకానమీ రేటు కేవలం 7.42గా ఉండటం విశేషం.
అతడు ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి కెప్టెన్ రిషభ్ పంత్ విశ్వాసాన్ని గెలుచుకున్నాడు.
విప్రాజ్ నిగమ్
బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన కనబరిచిన విప్రాజ్ నిగమ్
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగం అత్యుత్తమంగా వ్యవహరిస్తోంది. కుల్దీప్ యాదవ్ ఒక వైపున నిలకడగా వికెట్లు తీస్తూ దూకుడుగా ఆడుతుంటే, మరోవైపు అతడికి తోడుగా ఉన్న విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ సీజన్‌కు ముందు అభిమానులకు తెలియని పేరు అయినా, లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో మార్క్రమ్ వికెట్ తీయడంతో పాటు 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చాడు.
అప్పటి నుంచి బౌలింగ్‌లో మంచి స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ, ఇప్పటివరకు 7 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో కూడా తన పాత్రతో ఢిల్లీ జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు.
సాయి సుదర్శన్
రన్‌మెషీన్.. సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్, ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
కోహ్లీ, రాహుల్, శుభ్‌మన్‌లను కూడా మించిపోయి 6 మ్యాచ్‌ల్లో 54.83 సగటుతో 329 పరుగులు చేశాడు.
నాలుగు అర్ధశతకాలు నమోదు చేసిన అతడిని, మొత్తం పరుగుల పరంగా నికోలస్ పూరన్ మాత్రమే మించిపోయాడు.
గత సీజన్‌లో కూడా తన సత్తా చాటిన సుదర్శన్, ఈసారి దూకుడు పెంచి తన స్ట్రైక్ రేట్‌ను 150కి పైగా ఉంచడం విశేషం.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి గుజరాత్‌కు విజయవంతమైన ఆరంభాలు ఇస్తూ నాలుగు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
రఘువంశీ
భిన్నమైన శైలిలో కీలక ఇన్నింగ్స్.. రఘువంశీ
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో దూకుడుగా ఆడే ఆటగాళ్ల మధ్య శాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించగల సమర్థుడు ఆంగ్క్రిష్ రఘువంశీ.
2022 అండర్-19 ప్రపంచకప్‌తో గుర్తింపు పొందిన ఈ ఢిల్లీ యువకుడు, తక్కువ వయస్సులోనే అద్భుతమైన టెక్నిక్‌తో ఆకట్టుకుంటున్నాడు.
సుందరమైన టైమింగ్‌తో ఖచ్చితమైన షాట్లు ఆడుతూ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎక్కువ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఇచ్చాడు.
ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 170 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌పై విలువైన అర్ధశతకం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
భవిష్యత్తులో టీమిండియాలో చోటు సంపాదించగల ప్రతిభావంతుడిగా రఘువంశీ గుర్తింపు పొందాడు.