IPL 2026: ప్లేఆఫ్స్ దిశగా హైదరాబాద్.. కోల్‌కతాకు 'డూ ఆర్ డై' పోరు
ఈ వార్తాకథనం ఏంటి
వరుసగా అయిదు విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం సొంత మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యాలు నిలబెట్టడం, లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయాన్ని అందుకోవడం హైదరాబాద్ ప్రత్యేకతగా మారింది. రెగ్యులర్ నాయకుడు ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, తర్వాత ఇషాన్ కిషన్, క్లాసెన్‌లలో కనీసం ఇద్దరు మెరుపులు మెరిపిస్తుండడంతో హైదరాబాద్‌కు దూసుకెళ్తోంది. ముంబయితో జరిగిన గత పోటీలో 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి, ఇంకా ఎనిమిది బంతులు మిగిలుండగానే అందుకోవడం జట్టు దూకుడును స్పష్టం చేసింది.
వివరాలు
రెండింటిలో మాత్రమే గెలిచిన కోల్‌కతా
ముఖ్యంగా ట్రావిస్ హెడ్, క్లాసెన్ అద్భుత ప్రదర్శనతో జట్టులో ఉత్సాహం నిండింది. ఈ పోటీలో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ దిశగా హైదరాబాద్ మరో కీలక అడుగు వేస్తుంది. ఇలాంటి బలమైన జట్టును ఎదుర్కొనే కోల్‌కతా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. అయితే ఆ రెండు విజయాలు వరుసగా రావడం కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యంగా లఖ్‌నవూతో జరిగిన పోటీలో సూపర్ ఓవర్ వరకు పోరాడి గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయినప్పటికీ బౌలింగ్ విభాగం పరవాలేదనిపించినా, బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం కోల్‌కతాకు పెద్ద లోపంగా మారింది.
వివరాలు
అహ్మదాబాద్‌లో మరో పోరు.. పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్
కెప్టెన్ రహానె, కామెరూన్ గ్రీన్, రోమన్ పావెల్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం ఆ జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది. రిజర్వ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రాత్రి 7.30 గంటల నుంచి అహ్మదాబాద్‌లో మరో పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. వరుస విజయాలతో ముందుకు సాగిన పంజాబ్ గత మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు వరుసగా రెండు విజయాలు సాధించిన గుజరాత్ జట్టు మూడో విజయంపై దృష్టి పెట్టింది. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.