అప్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. వన్డే సిరీస్ లంకదే
అప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆతిథ్య శ్రీలంక 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో అప్ఘనిస్తాన్ ను లంక చిత్తుగా ఓడించింది. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై రేసులో ఉన్న శ్రీలంక సొంతగడ్డపై సిరీస్ ను సాధించింది. మూడో వన్డేల్లో బ్యాటర్లు, బౌలర్లు విజృంభించడంతో లంక 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ 22.2 ఓవర్లలో 116 పరుగులు చేసి ఆలౌటైంది. 23 పరుగులతో నబీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇబ్రహీం జర్దాన్ 22, గుల్ బదానై 20 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమీరా నాలుగు, హసరంగ 3, కుమార్ రెండు వికెట్లతో చెలరేగారు.
అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక
హసరంగ నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. 117 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 16 ఓవర్లలోనే చేధించింది. కరుణరత్నే (56 నాటౌట్), ప్రథుమ్ నిస్సంక 51 పరుగులతో విజృంభించడంతో లంక 9 వికెట్ల తేడాతో గెలిచింది. బాల్స్ పరంగా వన్డేల్లో శ్రీలంకకు అతి పెద్ద విజయాల్లో ఇది ఒకటి కావడం విశేషం. తొలి వన్డేలో ఆప్ఘనిస్తాన్ విజయం సాధించగా.. మిగిలిన రెండు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.