ఒమన్‌పై శ్రీలంక భారీ విజయం
ఐసీసీ వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ మ్యాచులో శ్రీలంక వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బులవాయోలో నేడు ఒమన్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక ఓపెనర్లు పాతుస్ నిస్సాంక, కరుణరత్నే అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 30.2 ఓవర్లలో 98 పరుగులు చేసి ఆలౌటైంది. అయ్యాన్ ఖాన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఒమన్ బ్యాటర్లలో మహ్మద్ నదీమ్, షోయాబ్ ఖాన్, ఓదేరా, బిలాల్ ఖాన్ డకౌట్‌తో నిరాశపరిచారు.
5 వికెట్లతో చెలరేగిన హసరంగ
శ్రీలంక బౌలర్ హసరంగ 7.2 ఓవర్లలో 5 వికెట్లు తీసి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుమారా 3 వికెట్లు, రజిత ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 35 ఓవర్లు మిగిలి ఉండగాలనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు పాతుస్ నిస్సాంక 39 బంతుల్లో 37 పరుగులు, కరుణరత్నే 51 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. అదే విధంగా కరుణరత్నే వన్డేల్లో తన 10వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అతను వన్డేల్లో 32.00 సగటుతో 992 పరుగులు చేశాడు. నిస్సాంక 28 వన్డే మ్యాచులలో 36.19 సగటుతో 941 పరుగులు చేశాడు. ఈ విజయంలో శ్రీలంక గ్రూప్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.