Srilanka: టీమిండియాతో టెస్టుకు ముందు శ్రీలంకకు బిగ్ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆ జట్టు కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక దూరమయ్యారు. గాయాల కారణంగా వీరిద్దరూ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా కెప్టెన్సీలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ (SLC) ప్రకటించింది. గత నెల 19న కొలంబోలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్‌లో పరుగులు తీస్తున్న సమయంలో కుశాల్ మెండిస్ కుడి తొడ కండరాలకు గాయమైంది. అప్పటి నుంచి అతను జాతీయ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నాడు.
వివరాలు
గత నెలలో లండన్‌లో మణికట్టుకు శస్త్రచికిత్స..
మరోవైపు ఓపెనర్ పతుమ్ నిస్సంక గత నెలలో లండన్‌లో మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
అయితే అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు.
ఇద్దరు కీలక బ్యాటర్లు అందుబాటులో లేకపోవడంతో సెలక్టర్లు వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాకు మరోసారి అవకాశం ఇచ్చారు.
2023లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన డిక్వెల్లా.. 54 టెస్టుల అనుభవంతో తిరిగి జట్టులోకి వచ్చాడు.
భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిన అంజలా బండార కంటే డిక్వెల్లా అనుభవానికే సెలక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు.
ఇదే ప్రాక్టీస్ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.
వివరాలు
వారిపై సెలక్టర్లు వేటు..
పేసర్లు కసున్ రజిత, ఇసిత విజేసుందరపై సెలక్టర్లు వేటు వేశారు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో 66, 63 నాటౌట్ పరుగులతో రాణించిన నిషాన్ మధుష్క మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
శ్రీలంక జట్టుకు ధనంజయ డిసిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
దినేశ్ చండిమాల్, లహిరు ఉడార, పసిందు సూరియబండార, సోనాల్ డినుషాలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.
స్పిన్ విభాగానికి ప్రభాత్ జయసూర్య నాయకత్వం వహించనున్నాడు.
అతనికి రమేశ్ మెండిస్, అరంగేట్ర ఆటగాడు కేశర నువంత సహకారం అందించనున్నారు.
పేస్ బౌలింగ్ విభాగంలో అసిత ఫెర్నాండో కీలకంగా వ్యవహరించనుండగా.. లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, దిల్షాన్ మధుశంకలు అతడికి తోడుగా ఉండనున్నారు.
వివరాలు
ఆగస్టు 23 నుంచి 27వ తేది వరకు మ్యాచ్..
భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరగనుంది.
శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), లహిరు ఉడార, నిషాన్ మధుష్క, దినేశ్ చండిమాల్, పసిందు సూరియబండార, సోనాల్ డినుషా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక.