LOADING...
RCB: విజయోత్సవం సమయంలో తొక్కిసలాట.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
విజయోత్సవం సమయంలో తొక్కిసలాట.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

RCB: విజయోత్సవం సమయంలో తొక్కిసలాట.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ వేళ బెంగళూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆర్సీబీపై కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఈ కేసుపై ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్‌) తరఫున న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, తప్పుడు కేసులో ఇరికించారని వాదించారు.

Details

కేసును కొట్టేయాలని కోరిన ఆర్సీబీ

ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. ఇక ఈ వేడుకల నిర్వహణ బాధ్యతలు చూసిన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కూడా తమపై నమోదైన కేసుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది. వారు కూడా తాము నిర్దోషులమని పేర్కొన్నారు. గతంలో స్నేహమయి కృష్ణ అనే సమాచార హక్కు కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు అయింది. కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌), ఆర్సీబీ, డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌తో పాటు పలు సమాఖ్యలపై తొక్కిసలాట కారణంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఆర్సీబీ తమపై ఉన్న ఈ కేసును రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, ఈ కేసు దశ దిశ మార్చుకునే అవకాశం కనిపిస్తోంది.