జావెలిన్ త్రో: భారత్‌కు మరో టైటిల్ తీసుకొచ్చిన నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లాసేన్ డైమండ్ లీగ్ 2023లో సత్తా చాటాడు. 87.66మీటర్లు బల్లాన్ని విసిరి భారతదేశానికి మరో టైటిల్ తీసుకుని వచ్చాడు. ఈ కాంపిటీషన్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మొదటి రౌండ్ లో నీరజ్ విసిరిన త్రో, చెల్లుబాటు కాలేదు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మొదటి రౌండ్‌లో 86.20మీటర్లు విసిరి టాప్‌లోకి దూసుకెళ్లాడు. టాప్ 3లో కూడా నీరజ్‌కు స్థానం దక్కలేదు. రెండో రౌండ్‌లో 83.52మీటర్లు విసిరి తన ర్యాంకును కొద్దిగా మెరుగుపరుచుకుని మూడో స్థానంలోకి వచ్చాడు నీరజ్. ఆ సమయంలోనూ మొదటి స్థానంలోనే జూలియన్ వెబర్ ఉన్నాడు.
ఐదో రౌండ్ లో అత్యధిక దూరం విసిరిన నీరజ్
ఇక మూడో రౌండ్‌లో తన ప్రతిభను మరింత చాటుకున్నాడు నీరజ్. ఏకంగా 85.02మీటర్ల విసిరి రెండో ర్యాంకును చేరుకున్నాడు. 86.20మీటర్లతో మొదటి ర్యాంకులో జూలియన్ వెబర్ అలాగే ఉన్నాడు. నాలుగో రౌండ్‌లో నీరజ్ మళ్లీ విఫలమయ్యాడు. అయినా కూడా నీరజ్ రెండో స్థానంలోనే ఉన్నాడు. ఐదో రౌండ్ వచ్చేసరికి నీరజ్, తనలోని బలాన్నంతా చూపించాడు. 87.66మీటర్ల దూరం విసిరి శభాష్ అనిపించుకున్నాడు. ఐదు, ఆరు రౌండ్స్ లో నీరజ్ విసిరిన 87.66మీటర్ల దూరాన్ని జూలియన్ వెబర్ విసరలేకపోయాడు. దాంతో లాసేన్ డైమండ్ లీగ్ టైటిల్ దక్కించుకున్నాడు నీరజ్. ఈ లీగ్ లో రెండో స్థానంలో జూలియన్ వెబర్(జర్మనీ), మూడో స్థానంలో జాకుబ్ వాడ్లిచ్ (చెక్ రిపబ్లిక్) ఉన్నారు.