IPL 2026: సన్‌రైజర్స్-లక్నో మ్యాచ్ వివాదం.. రిషబ్ పంత్, షమీలపై నిషేధం ముప్పు!
ఈ వార్తాకథనం ఏంటి
టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముందుగా బౌలింగ్ ఎంచుకున్నప్పటి నుంచి సన్ రైజర్స్ బ్యాటర్లు తడబడ్డారు. మహ్మద్ షమీ తన అమోఘ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్స్ (SRH) బ్యాటర్ల నడ్డి విరిచాడు. మొదటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మను సున్నా పరుగులకే అవుట్ చేసిన షమీ, మూడో ఓవర్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను కూడా పెవిలియన్‌కి పంపాడు. తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన షమీ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పొదుపైన బౌలింగ్ గణాంకాల్లో ఒకటిగా నమోదైంది.
వివరాలు
అంపైర్లతో వివాదం
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో అసలు వివాదం మొదలైంది. షమీ తన నాలుగు ఓవర్ల బౌలింగ్ ముగించి విశ్రాంతికి వెళ్లినప్పుడు, అతని స్థానంలో మాథ్యూ బ్రీట్జ్ ఫీల్డింగ్‌కి వచ్చాడు. అయితే, అంపైర్లు ఈ మార్పును అడ్డుకున్నారు. షమీని మైదానంలోకి తిరిగి పంపాలని ఆదేశించడంతో అయోమయం ఏర్పడింది. ఈ సంఘటనలో కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్లతో కొంచెం పెద్దగా చర్చించడం కనిపించడంతో మరింత కలకలం రేపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (ఆర్టికల్ 2.3) ప్రకారం, మైదానంలో అంపైర్లపై అసభ్య పదజాలం వాడటం లేదా అమర్యాదగా ప్రవర్తించడం లెవల్-1 నేరం కింద వస్తుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీ ఈ సంఘటనను సమీక్షిస్తారు.
వివరాలు
చివర్లో పోరాడిన సన్ రైజర్స్ బ్యాటర్లు
పంత్ లేదా షమీ అసభ్య వ్యాఖ్యలు చేశారేమో అని తేలితే, వారికి మ్యాచ్ ఫీజులో కోత మాత్రమే కాకుండా ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం కూడా విధించవచ్చు. సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును కష్టాల నుండి బయటకు తీసుకువచ్చారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టు, 20 ఓవర్లలో 156 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ఘర్షణతో లక్నో జట్టు ఏకాగ్రతకు ఎలాంటి ప్రభావం వస్తుందో చూడాలి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.