India vs Pakistan: 'హ్యాండ్ షేక్'పై సూర్య హాట్ కామెంట్స్.. పాక్ షరతులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా-పాకిస్థాన్ మధ్య ప్రతిష్టాత్మక మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ పోరు శ్రీలంక వేదికగా జరగనుండగా, ఇప్పటికే వేలాదిగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. క్రీడా ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ అనేక వివాదాల నడుమ చివరకు సాకారం కావడం గమనార్హం. అయితే మ్యాచ్‌కు ముందు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మైదానంలో పోరు ఎంత రసవత్తరంగా ఉంటుందన్నది ఒక వైపు అయితే, మ్యాచ్ ముందు లేదా అనంతరం ఆటగాళ్లు పరస్పరం చేతులు కలుపుతారా? లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
Details
పాక్ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు
"భారత్ ఏం చేస్తే దాని ఆధారంగానే నిర్ణయం ఉంటుందని ఆఘా వ్యాఖ్యానించగా, సూర్యకుమార్ 24 గంటలు ఆగండి... మైదానంలో ఏమవుతుందో చూస్తారంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌లో రెండు జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఆ సమయంలో వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగగా, మ్యాచ్‌కు ముందు, అనంతరం షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. కొందరు ఆటగాళ్లు ప్రేరేపించేలా సంకేతాలు చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఆ సంఘటనల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదనే నిర్ణయానికి భారత్ వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
Details
ఐసీసీ బేటీ తర్వాత అడేందుకు గ్రీన్ సిగ్నల్
ఇదే సమయంలో మొదట భారత్‌తో మ్యాచ్ ఆడమని మొండిగా వ్యవహరించిన పాకిస్థాన్, అనంతరం ఐసీసీ భేటీ తర్వాత ఆడేందుకు అంగీకరించింది. అయితే ఇందుకు పలు షరతులు విధించినట్లు సమాచారం. ఆ షరతుల్లో భారత జట్టు షేక్‌హ్యాండ్ ఇవ్వాలన్న అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, మ్యాచ్ ఫలితంతో పాటు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. భారత్ చివరకు షేక్‌హ్యాండ్ ఇస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం మైదానంలోనే తేలనుంది.