LOADING...
Swiatek: స్వైటెక్‌ జైత్రయాత్ర కొనసాగింపు.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌కు అర్హత
స్వైటెక్‌ జైత్రయాత్ర కొనసాగింపు.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌కు అర్హత

Swiatek: స్వైటెక్‌ జైత్రయాత్ర కొనసాగింపు.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌కు అర్హత

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌పై కన్నేసిన పోలాండ్‌కు చెందిన మూడో సీడ్‌ ఇగా స్వైటెక్‌ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో ఆమె చెకియాకు చెందిన ప్లిస్కోవాపై 6-1, 6-3 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్వైటెక్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. తొలి సెట్లో ప్లిస్కోవా ఒక్క గేమ్‌కే పరిమితమవగా, స్వైటెక్‌ 4-0 ఆధిక్యం సాధించిన తర్వాత అదే ఊపును కొనసాగించి సెట్‌ను సొంతం చేసుకుంది.

వివరాలు

వరుసగా నాలుగు గేమ్స్‌లో ఆధిక్యం..

రెండో సెట్లో ప్లిస్కోవా కొంత ప్రతిఘటన కనబరిచి 2-0తో ముందంజలో నిలిచినా, స్వైటెక్‌ వెంటనే పుంజుకుని వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్వైటెక్‌ మొత్తం ఆరు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు 36 విన్నర్లు నమోదు చేసింది. ఇక అమెరికాకు చెందిన మాడిసన్‌ కీస్‌ కూడా విజయంతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఆమె బ్రిటన్‌కు చెందిన స్వాన్‌ను 6-1, 6-4తో ఓడించింది. తొలి రౌండ్‌లో సెరెనాపై సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి మయా జాయింట్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఆమె ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెగ్జాండర్‌ ఏలా చేతిలో 6-3, 2-6, 0-6 స్కోరుతో ఓటమి చవిచూసింది.

వివరాలు

యుకి, బాలాజీలకు నిరాశ..

అమెరికా ఆరో సీడ్‌ అనిసిమోవా తన సహచర క్రీడాకారిణి కెనిన్‌పై 6-2, 4-6, 7-6 (10-3)తో విజయం సాధించింది. రష్యాకు చెందిన సంసోనోవా 15వ సీడ్‌ ష్నైడర్‌ను 6-4, 4-6, 6-2తో ఓడించి ముందంజ వేసింది. అలాగే అమెరికాకు చెందిన నవారో, క్రూగర్‌, చెకియాకు చెందిన బౌజ్కోవా కూడా రెండో రౌండ్‌ అడ్డంకిని దాటారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు యుకి బాంబ్రి, శ్రీరామ్‌ బాలాజీ తమ తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లోనే ఓటమిపాలయ్యారు. శ్రీరామ్‌ బాలాజీ-డిమోలినెర్‌ (బ్రెజిల్‌) జోడీ 6-3, 6-7 (2-7), 4-6తో జర్మనీకి చెందిన సాండర్‌, నెదర్లాండ్స్‌కు చెందిన సెమ్‌ వెర్‌బీక్‌ జంట చేతిలో పరాజయం చెందింది.

Advertisement

వివరాలు

ట్రూన్‌గెల్టి ద్వయం చేతిలో ఓటమి..

మరో మ్యాచ్‌లో యుకి బాంబ్రి-మైకేల్‌ వీనస్‌ (ఆస్ట్రేలియా) ద్వయం 3-6, 4-6తో ఫ్రాన్స్‌కు చెందిన జీన్‌ రోజెర్‌, అమెరికాకు చెందిన వైన్‌గర్‌ జోడీకి తలవంచింది. ఇక అనిరుధ్‌ చంద్రశేఖర్‌-యుజుకి (జపాన్‌) జంట కూడా ఉత్కంఠభరిత పోరులో 4-6, 7-6 (7-3), 6-7 (7-10)తో పెరూకు చెందిన ఇగ్నాసియో, అర్జెంటీనాకు చెందిన ట్రూన్‌గెల్టి ద్వయం చేతిలో ఓడిపోయింది.

Advertisement

వివరాలు

జకోవిచ్‌కు సునాయాస విజయం..

25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకున్న సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. రెండో రౌండ్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన జకోవిచ్‌ గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌పై 6-3, 6-4, 6-2తో ఆధిపత్య విజయాన్ని నమోదు చేశాడు. తొలి రౌండ్‌లో చైనాకు చెందిన వు యిబింగ్‌పై కొంత శ్రమించిన జకోవిచ్‌, ఈసారి మాత్రం ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. బలమైన సర్వీసులు, కచ్చితమైన ప్లేస్‌మెంట్లతో ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాడు. మ్యాచ్‌లో 12 ఏస్‌లు నమోదు చేసిన జకోవిచ్‌ నాలుగు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సునాయాసంగా విజయం అందుకున్నాడు.

వివరాలు

మూడో రౌండ్ లోకి చేరింది వీరే..

జర్మనీకి చెందిన రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అమెరికాకు చెందిన ఆరో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ తన సహచర ఆటగాడు కిప్సన్‌పై 6-2, 6-2, 7-5తో గెలుపొందాడు. స్పెయిన్‌కు చెందిన యువ ఆటగాడు జొడార్‌ తన దేశానికే చెందిన కరెనో బస్టాను 3-6, 6-3, 1-6, 6-3, 6-4తో ఓడించి తదుపరి రౌండ్‌కు చేరాడు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన డిమెనార్‌, జర్మనీకి చెందిన బెర్గ్స్‌, బ్రిటన్‌కు చెందిన ఆర్థర్‌ ఫ్రె, ఇటలీకి చెందిన సొనెగొ కూడా రెండో రౌండ్‌ను విజయవంతంగా అధిగమించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

Advertisement