LOADING...
T20 World Cup 2026: భారత్‌లో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడకూదని బంగ్లాదేశ్‌ నిర్ణయం
భారత్‌లో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడకూదని బంగ్లాదేశ్‌ నిర్ణయం

T20 World Cup 2026: భారత్‌లో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడకూదని బంగ్లాదేశ్‌ నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 టీ20 వరల్డ్ కప్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ వేదికగా జరగాల్సిన ఈ మెగా టోర్నీ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు భారత్‌కు రావడం లేదని బీసీబీ అధికారికంగా ప్రకటించింది. జనవరి 22న నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చామని బీసీబీ వెల్లడించింది. అయితే వరల్డ్ కప్‌లో పాల్గొనాలంటే తప్పనిసరిగా భారత్‌కు రావాల్సిందేనని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 21న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బీసీబీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో బంగ్లాదేశ్ టోర్నీకి దూరమైతే, స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా తీసుకుంటామని ఐసీసీ తేల్చి చెప్పినట్లు సమాచారం.

వివరాలు 

పాకిస్థాన్ కూడా అదే దారిలో..

ఈ వివాదం నడుమ పాకిస్థాన్ అనూహ్యంగా రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లను బహిష్కరిస్తే, తామూ ఈ టోర్నీని బహిష్కరించే ఆలోచనలో ఉన్నామని పాకిస్థాన్ భావిస్తున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం... "బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే, పాకిస్థాన్ కూడా అదే దారిలో నడుస్తుంది" అనే చర్చ అక్కడ జరుగుతోందట. గతంలో భారత్ ఒత్తిడి కారణంగా పాకిస్థాన్ తమ హోం మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ కారణాన్ని ఐసీసీ అంగీకరించింది. అయితే ఇప్పుడు అదే తరహా కారణాన్ని బంగ్లాదేశ్ ప్రస్తావించినప్పటికీ, ఐసీసీ అంగీకరించకపోవడం పాకిస్థాన్‌ను నిరాశకు గురి చేసిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాలు 

పాకిస్థాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. 

ఇదిలా ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన మరో నివేదికలో మాత్రం పాక్ టోర్నీ నుంచి తప్పుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బహిష్కరణ అన్న ఆలోచన ఎప్పుడూ లేదని ఆ నివేదిక పేర్కొంది. ఏదేమైనా... బంగ్లాదేశ్ భారత్‌కు రాదని తుది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, పాకిస్థాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Advertisement