T20 World Cup 2026: భారత్ 2024 టీ20 ప్రపంచకప్ ఎలా గెలిచింది?
ఈ వార్తాకథనం ఏంటి
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు, 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి, టీ20 ప్రపంచకప్ 2024ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ మరోసారి టీ20 ప్రపంచకప్ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ టోర్నీలో భారత్ మరో ప్రత్యేక రికార్డును కూడా నెలకొల్పింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. మొత్తం 9 మ్యాచ్‌లకు గానూ భారత్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కెనడాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా 'నో రిజల్ట్'గా ముగిసింది.
వివరాలు
గ్రూప్ దశలో భారత్ ప్రస్థానం
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఐర్లాండ్ చేసిన 97 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13 ఓవర్లలోపే చేధించింది. ఆ తర్వాత న్యూయార్క్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. 119పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న భారత్, పాక్‌ను 113/7కే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే,సూపర్ 8కి అర్హత దక్కేది కాదు. మూడో గ్రూప్ మ్యాచ్‌లో అమెరికాతో ఆడిన భారత్,అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో సులువుగా గెలిచింది. 111 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్‌లోనే భారత్ చేధించింది. ఇక కెనడాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి 'నో రిజల్ట్'గా ముగిసింది.
వివరాలు
సూపర్ 8లో భారత్ దూకుడు
సూపర్ 8 దశలో అఫ్గానిస్తాన్‌పై భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులతో మెరిశాడు. ఆ తర్వాత బుమ్రా, అర్ష్‌దీప్ చెరో మూడు వికెట్లు తీసి విజయాన్ని ఖాయం చేశారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కూడా భారత్ ఆధిపత్యం చూపింది. 196 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్, 50 పరుగుల తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు సెమీఫైనల్‌కు దగ్గరైంది. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ 92 పరుగులతో చెలరేగి, భారత్‌కు 24 పరుగుల విజయం అందించాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు దూరమైంది.
వివరాలు
సెమీఫైనల్, ఫైనల్‌లో చాంపియన్ ప్రదర్శన
సెమీఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ 68 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 2022 టీ20 ప్రపంచకప్ ఓటమికి ఇదే ప్రతీకారం. ఇంగ్లండ్‌ను కేవలం 103 పరుగులకే ఆలౌట్ చేయడంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 176 పరుగులు చేసి, ఆ స్కోర్‌ను కాపాడుకుంది. దక్షిణాఫ్రికాను 169 పరుగులకే పరిమితం చేసి, భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని, దేశానికి మరో చిరస్మరణీయ ఘనతను అందించింది.