IND vs PAK: ప్రపంచ కప్ వేదికగా మరోసారి దాయాదుల సమరం.. భారత్ రికార్డు ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్నిరోజులుగా ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీమిండియాతో ఆడబోమని పాకిస్థాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగింది. అయితే ఐసీసీ జోక్యంతో పరిస్థితి మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించినట్లు స్పష్టం చేసింది. సాధారణంగానే భారత్,పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందే అభిమానులు చర్చలు, అంచనాలతో మునిగిపోతారు.
వివరాలు
టీ20 ప్రపంచ కప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు
పాక్ బహిష్కరణ డ్రామా తర్వాత ఇరు చిరకాల ప్రత్యర్థులు మళ్లీ తలపడనుండటంతో ఆదివారం జరిగే ఈ హై వోల్టేజ్ పోరుకు మరింత హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది టీ20 ప్రపంచ కప్‌లు జరగ్గా,పాకిస్థాన్‌పై భారత్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. టోర్నీ ఆరంభమైన 2007 నుంచి ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరగ్గా,టీమిండియా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్థాన్ మాత్రం ఒక్కసారి మాత్రమే..అది కూడా 2021లో.. విజయం సాధించింది. మొత్తంగా భారత్, పాకిస్థాన్ మధ్య 16 టీ20 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది.
వివరాలు
మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించిన పాకిస్థాన్
పాకిస్థాన్ కేవలం మూడు మ్యాచ్ లలో విజయం సాధించగలిగింది. 2007 ప్రపంచ కప్‌లో రెండు సార్లు తలపడిన ఈ రెండు జట్ల పోరులో రెండింటిలోనూ భారత్‌కే విజయం దక్కింది. అదే ఎడిషన్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా తన తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 119 పరుగులకే ఆలౌటైనా, లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది. బుమ్రా 3 వికెట్లు 14 పరుగులకే పడగొట్టగా, హార్దిక్ పాండ్య 2 వికెట్లు 24 పరుగులిచ్చి కీలక పాత్ర పోషించాడు.
వివరాలు
ప్రస్తుత భారత జట్టులో పాకిస్థాన్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన తిలక్ వర్మ
ఫలితంగా భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే 2012 టీ20 ప్రపంచ కప్‌లో కొలంబో వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఎనిమిదివికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఘనంగా ఓడించింది. ఇప్పుడు కూడా మ్యాచ్ అదే వేదికపై జరగనుండటంతో మరోసారి చిరకాల ప్రత్యర్థిని ఓడించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత భారత జట్టులో పాకిస్థాన్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 130 పరుగులు చేశాడు.మొత్తంగా చూస్తే కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 492 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో భారత్ తరఫున హార్దిక్ పాండ్య అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టాడు.అతని బెస్ట్ ప్రదర్శన 3 వికెట్లు 8 పరుగులకే.