BCB - ICC: భారత్‌లోనే టీ20 వరల్డ్‌కప్.. వేదికల మార్పుకు ఐసీసీ ప్రతిపాదన!
ఈ వార్తాకథనం ఏంటి
భద్రతా కారణాలను సూచిస్తూ భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ఐసీసీ (ICC) దృష్టికి తీసుకెళ్లింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీవ్ చేయడం తర్వాతే, బంగ్లాదేశ్ ఈ భద్రతా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Details
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయని ఐసీసీ
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబయి వేదికలపై ఆడాల్సి ఉంది. అయితే భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లను చెన్నై, తిరువనంతపురానికి మార్చాలని ఐసీసీ బీసీబీకి సూచించినట్లు సమాచారం. కానీ ఈ ప్రతిపాదనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ అంశంపై స్పందించిన బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ స్పందించారు. టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన విషయాల్లో మేము స్వయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోం. మా ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Details
నాలుగు వారాల సమయం పట్టే అవకాశం
ఇదిలా ఉండగా ఆదివారం వడోదర వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించాడు. ఇదే కాకుండా, టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో కూడా సైకత్‌తో పాటు గాజీ సోహెల్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. భారత్‌లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బీసీబీ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంపైర్ భారత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించిన అంశాన్ని ఐసీసీ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. అలాగే వరల్డ్‌కప్ ప్రారంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఈ వివాదంపై ఐసీసీ త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.