LOADING...
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో నేడు న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా సెమీఫైనల్
టీ20 ప్రపంచ కప్ లో నేడు న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా సెమీఫైనల్

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో నేడు న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా సెమీఫైనల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం ఆసన్నమైంది. తొలి సెమీఫైనల్‌లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో అజేయంగా దూసుకెళ్తూ దక్షిణాఫ్రికా తుది నాలుగులో చోటు సంపాదిస్తే.. కివీస్‌ కష్టంగా ముందంజ వేసింది. సఫారీ జట్టు ప్రదర్శన బలంగా కనిపిస్తున్నప్పటికీ, కివీస్‌ను తక్కువగా అంచనా వేయడం ప్రమాదకరం. మరి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

వివరాలు 

కోల్‌కతా

టీ20 ప్రపంచకప్‌లో తొలి ఫైనలిస్ట్‌గా ఏ జట్టు నిలుస్తుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఎదురెదురుగా నిలవనున్నాయి. రెండు జట్లూ తమ చరిత్రలో తొలి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలనే లక్ష్యంతో పోటీలో దిగుతున్నాయి. అందువల్ల ఈ మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. హోరాహోరీ పోరు ఖాయం అనిపిస్తోంది. అయితే ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో ఐదు సార్లు తలపడిన దక్షిణాఫ్రికా ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం సఫారీ జట్టుకు మానసిక బలాన్నిస్తోంది.

వివరాలు 

జోరుమీద దక్షిణాఫ్రికా

సెమీఫైనల్ పోరులో దక్షిణాఫ్రికానే ఫేవరెట్‌గా భావిస్తున్నారు. ఈ టోర్నీలో ఆ జట్టు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అప్రతిహత విజయాలతో ముందుకు సాగింది. గ్రూప్ దశలోనూ,సూపర్-8 దశలోనూ సఫారీ జట్టు ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం చాటింది. అదే ధైర్యంతో ఇప్పుడు సెమీస్‌కు సిద్ధమైంది.దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ధాటిగా పరుగులు సాధిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ మార్క్రమ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అతను 53.60 సగటుతో, 175.16 స్ట్రైక్‌రేట్‌తో 268 పరుగులు చేసి మూడు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. మూడో స్థానంలో వచ్చే రికెల్టన్ కూడా 171.42 స్ట్రైక్‌రేట్‌తో 228 పరుగులు సాధించి మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు.

Advertisement

వివరాలు 

జోరుమీద దక్షిణాఫ్రికా

మిడిల్ ఆర్డర్‌లో బ్రెవిస్,మిల్లర్,స్టబ్స్ వంటి ప్రమాదకర బ్యాటర్లు ఉండటం దక్షిణాఫ్రికాకు మరింత బలం. యాన్సెన్ కూడా అవసరమైనప్పుడు వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం కలవాడు. బౌలింగ్ విభాగం కూడా ఎంతో పదునుగా ఉంది. రబాడ,ఎంగిడి,బోష్,యాన్సెన్,కేశవ్ మహరాజ్‌లతో దక్షిణాఫ్రికా దాడి బలంగా కనిపిస్తోంది. ఎంగిడి స్లో బంతులతో మంచి ఫలితాలు సాధిస్తుండగా,బోష్ చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. వీరిద్దరితో పాటు యాన్సెన్ కూడా ఈ టోర్నీలో పదికి పైగా వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో కేశవ్ మహరాజ్ ప్రత్యర్థుల పరుగులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రబాడ మాత్రం తన పూర్తి స్థాయి ఫామ్‌ను ఇంకా అందుకోవాల్సి ఉంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై గెలిచిన అనుభవం కూడా దక్షిణాఫ్రికాకు మానసికంగా పైచేయిని అందిస్తోంది.

Advertisement

వివరాలు 

కివీస్‌ పుంజుకునేనా..!

దక్షిణాఫ్రికా జోరును అడ్డుకోవాలంటే న్యూజిలాండ్ మరింత మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంటుంది. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి కివీస్ చాలా శ్రమించాల్సి వచ్చింది. సూపర్-8 దశలో చివరి మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో ఆ జట్టు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే దక్షిణాఫ్రికా అంత భీకరంగా కనిపించకపోయినా కివీస్‌కు కూడా మంచి లైనప్పే ఉంది. అయితే బ్యాటర్లు మరింత స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ సీఫెర్ట్ ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అతను 43.20 సగటుతో, 157.66 స్ట్రైక్‌రేట్‌తో 216 పరుగులు సాధించాడు. టోర్నీ ప్రారంభంలో అద్భుతంగా ఆడిన అతను తరువాత అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయాడు.

వివరాలు 

కివీస్‌ పుంజుకునేనా..!

అలెన్ మంచి లయలో ఉన్నప్పటికీ ఇంకా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వాలని కివీస్ ఆశిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై ఫిలిప్స్, మిచెల్, రచిన్ కూడా తమ ప్రతిభ చూపాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 200 పరుగుల స్కోరు నమోదు చేయాల్సిందే. అలా చేస్తేనే మ్యాచ్‌లో పోటీ ఇవ్వగలదు. అందుకు బ్యాటింగ్ విభాగం సమష్టిగా రాణించాలి. ఇప్పటివరకు బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించని రచిన్ ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాడా అనే ఆసక్తి ఉంది.

వివరాలు 

కివీస్‌ పుంజుకునేనా..!

ఇక కెప్టెన్ శాంట్నర్ బ్యాటుతో కూడా మంచి ఫామ్‌లో ఉండటం కివీస్‌కు పెద్ద ప్లస్. సూపర్-8 దశలో శ్రీలంకపై జరిగిన కీలక మ్యాచ్‌లో అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి కారణమయ్యాడు. సఫారీ బ్యాటర్లను నియంత్రించగల స్పిన్ బౌలర్లు న్యూజిలాండ్ జట్టులో ఉన్నారు. కెప్టెన్ శాంట్నర్‌తో పాటు రచిన్,ఫిలిప్స్ స్పిన్ విభాగంలో మంచి ప్రదర్శన చూపించారు. ఈమ్యాచ్‌లో వారు ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి.రచిన్ ఇప్పటివరకు 7కన్నా తక్కువ ఎకానమీతో 9 వికెట్లు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సవాలు విసరగల నాణ్యమైన మణికట్టు స్పిన్నర్ లేకపోవడం న్యూజిలాండ్‌కు కొంత లోటు. ఇష్‌ సోధి పెద్దగా ఫామ్‌లో లేడు.ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ తొలి స్పెల్‌లో చేసే బౌలింగ్ న్యూజిలాండ్‌కు చాలాకీలకంగా మారనుంది.

వివరాలు 

పిచ్.. వాతావరణం

ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ సందర్భంగా వర్షం పడే సూచనలు లేవు. అయినప్పటికీ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోతే ఆగిన చోటు నుంచే తర్వాతి రోజు ఆట కొనసాగుతుంది. రెండో రోజున కూడా మ్యాచ్ జరగకపోతే సూపర్-8 దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టుకు ముందంజ లభిస్తుంది. సూపర్-8 గ్రూప్-1లో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు మూడు పాయింట్లతో గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధించింది.

వివరాలు 

ముఖాముఖిలో..

మొత్తం మ్యాచ్‌లు : 19 దక్షిణాఫ్రికా గెలిచినవి : 12 న్యూజిలాండ్‌ గెలిచినవి : 7 తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: డికాక్, రికెల్టన్, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బోష్, కేశవ్‌ మహరాజ్, రబాడ, ఎంగిడి. న్యూజిలాండ్‌: అలెన్, సీఫర్ట్, రచిన్‌ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్‌ (కెప్టెన్‌), నీషమ్, డఫీ, ఫెర్గూసన్, ఇష్‌ సోధి. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడ్డ మ్యాచ్‌లు. అన్ని మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికానే గెలిచింది.

Advertisement