Washington Sundar: టీమిండియాకు గాయాల బెడద.. మరో కీలక ఆల్ రౌండర్ దూరమయ్యే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ మధ్యలో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ కారణంగా అతడు కేవలం ఐదు ఓవర్లపాటే బౌలింగ్ చేయగలిగాడు. ఫీల్డింగ్‌లో అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే బ్యాటింగ్ సమయంలో మాత్రం వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. అయినప్పటికీ తదుపరి మ్యాచ్‌లో అతడు ఆడతాడా? లేక సిరీస్‌కే దూరమవుతాడా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాక్టీస్ సమయంలో గాయపడిన రిషబ్ పంత్ ఇప్పటికే ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
Details
పరుగులు తీసే క్రమంలో ఇబ్బంది పడిన సుందర్
ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అతడు కాస్త ఇబ్బందిగా కనిపించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 21 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి నాటౌట్‌గా నిలిచి భారత జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ గాయం గురించి కేఎల్ రాహుల్ స్పందించాడు. 'సుందర్ గాయం తీవ్రత గురించి నాకు స్పష్టంగా తెలియదు. మ్యాచ్ సమయంలో అతడు బంతిని బాగానే కొట్టాడు. అతడు పరుగులు తీయలేకపోతున్నాడని నాకు తెలియదు.
Details
తన పాత్రను చక్కగా నిర్వహించిన వాషింగ్టన్ సుందర్
తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం అతడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడని గమనించానని రాహుల్ అన్నాడు. అదే సమయంలో 'సుందర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు చేయాల్సిన పరుగులు ఎక్కువగా లేవు. బంతికో పరుగు తీస్తే సరిపోయింది. పెద్ద రిస్క్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. అతడిపై పెద్దగా ఒత్తిడి కూడా లేదు. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ వాషింగ్టన్ సుందర్ తన పాత్రను చక్కగా నిర్వహించాడు' అని రాహుల్ వివరించాడు. ఇక వాషింగ్టన్ సుందర్ గాయంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా స్పందించాడు. 'వాషింగ్టన్ సుందర్ సైడ్ స్ట్రైన్‌తో బాధపడుతున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు స్కాన్‌కు వెళ్తాడు' అని గిల్ తెలిపాడు.