LOADING...
T20 World Cup: 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసిన భారత్
93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసిన భారత్

T20 World Cup: 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
10:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 24 బంతుల్లోనే 61పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అలాగే హార్దిక్‌ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సంజు శాంసన్‌ (22),తిలక్‌ వర్మ (25),శివమ్‌ దూబె (23)కూడా కీలకంగా రాణించారు.

వివరాలు 

భారత్‌ బౌలర్ల ధాటికి కుప్పకూలిన నమీబియా

నమీబియా బౌలర్లలో గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా,బెన్‌ షికాంగో,జేజే స్మిత్‌,బెర్నార్డ్‌ తలో ఒక వికెట్‌ చొప్పున తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా బ్యాటింగ్‌ భారత్‌ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌటైంది. స్టీన్‌ కాంప్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఫ్రైలింక్‌ (22),ఎరాస్మస్‌ (18)తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు తీసి చెలరేగాడు. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా రెండేసి వికెట్లు సాధించగా, బుమ్రా, శివమ్‌ దూబె, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలో ఒక వికెట్‌ చొప్పున పడగొట్టారు. ఇక కొలంబో వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో భారత్‌ మూడో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement