LOADING...
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కి టీమిండియా రెడీ.. కానీ ఆ మూడు జట్లతోనే టీమిండియాకు ముప్పు!
కానీ ఆ మూడు జట్లతోనే టీమిండియాకు ముప్పు!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కి టీమిండియా రెడీ.. కానీ ఆ మూడు జట్లతోనే టీమిండియాకు ముప్పు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026కు టీమిండియా అన్ని కోణాల్లో సిద్ధంగా ఉంది. ఈ మెగా టోర్నీకి తుది సన్నాహకంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యం చాటిన టీమిండియా ఏకపక్ష విజయాలతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. ముఖ్యంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి, కివీస్ శిబిరంలో వణుకు పుట్టించింది.

వివరాలు 

మూడు జట్ల నుంచి భారత్‌కు గట్టి సవాల్..

ఈ భీకర బ్యాటింగ్ ప్రదర్శన చూసి క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్,సైమన్ డౌల్‌లు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం టీమిండియాకు అసలైన పోటీ టీమిండియానే అన్న స్థాయిలో జట్టు సమతూకంగా ఉందని కొనియాడారు. విధ్వంసకర బ్యాటింగ్, మెరుపు వేగం ఫీల్డింగ్, కత్తిలాంటి బౌలింగ్‌తో భారత్ మెగా టోర్నీకి రెడీగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రపంచకప్‌లో మూడు జట్ల నుంచి భారత్‌కు గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశముంది. అదేవిధంగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ హోమ్ జట్టు కూడా టైటిల్ గెలవలేదు. ఈ రికార్డు కూడా భారత్‌కు కొంత ఆందోళన కలిగిస్తోంది.లీగ్ దశలో పెద్దగా సమస్యలు లేకపోయినా, సూపర్-8లో మాత్రం అసలైన పరీక్ష ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.

వివరాలు 

1. ఆస్ట్రేలియా

భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే జట్లపై ఒకసారి దృష్టిపెడదాం. నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా, పాకిస్థాన్‌లతో గ్రూప్-ఏలో ఉన్న ఆతిథ్య భారత్ సులభంగానే సూపర్-8కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్‌తో కొంత పోటీ ఉన్నా, గతం నుంచి ఇప్పటివరకు ఉన్న రికార్డులు చూస్తే టీమిండియాదే పైచేయిగా భావించవచ్చు. అయితే సూపర్-8 దశలో భారత్‌కు ఆస్ట్రేలియా నుంచి తీవ్ర సవాల్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్‌ను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేం. ముఖ్యంగా ఆసియా పిచ్‌లపై వారు అద్భుతంగా రాణిస్తున్నారు.

Advertisement

వివరాలు 

1. ఆస్ట్రేలియా

ఆడమ్ జంపా లాంటి నాణ్యమైన స్పిన్నర్‌తో పాటు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి ప్రమాదకర బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. ఒత్తిడిలోనూ నిలబడి ఆడటం ఆసీస్ ఆటగాళ్లకు అలవాటు. భారత్‌లోనే జరిగిన వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోసారి అదే ఘనతను సాధించాలనే పట్టుదలతో ఆసీస్ బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ అనుభవం వల్ల భారత పిచ్‌లపై వారికి మంచి అవగాహన ఉంది. ఈ కారణాలన్నింటితో టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రధాన పోటీదారిగా మారుతోంది.

Advertisement

వివరాలు 

2. ఇంగ్లండ్

పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరహాలోనే అత్యంత దూకుడుగా ఆడే జట్టు ఇంగ్లండ్. హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి పవర్ హిట్టర్లు ఉండటంతో ఏ లక్ష్యాన్నైనా ఛేదించే సామర్థ్యం వారికి ఉంది. ఐపీఎల్‌లో ఆడిన అనుభవంతో ఇంగ్లండ్ ఆటగాళ్లకు భారత పిచ్‌లు బాగా తెలుసు. అదేవిధంగా నాణ్యమైన స్పిన్ బౌలింగ్ కూడా ఆ జట్టుకు బలంగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ చేతిలో ఓడినా, ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఇంగ్లండ్ ఎప్పుడూ తన సత్తా చాటుతూనే ఉంటుంది. ఆస్ట్రేలియా తర్వాత భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే జట్టుగా ఇంగ్లండ్ నిలుస్తోంది.

వివరాలు 

3. సౌతాఫ్రికా

గత టీ20 ప్రపంచకప్‌-2024లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా కూడా భారత్‌కు ముప్పుగా మారచ్చు. క్షణమైనా నిర్లక్ష్యం చేస్తే సఫారీలు భారత్‌ను ఓడించే శక్తి కలిగి ఉన్నారు. ఐడెన్ మార్క్‌రమ్ నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు సమతూకంగా ఉంది. డికాక్,డేవిడ్ మిల్లర్,స్టబ్స్, బ్రెవిస్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో పాటు జాన్సెన్,బాష్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. రబడా,అన్రిచ్ నోర్జ్,ఎంగిడి వంటి వేగవంతమైన పేసర్లతోపాటు కేశవ్ మహరాజ్ రూపంలో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ కారణంగా చాలామంది సౌతాఫ్రికాఆటగాళ్లకు భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. అంతేకాదు,సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా వారికి నిరంతర ప్రాక్టీస్ కూడా లభించింది.ఈనేపథ్యంలో మెగా టోర్నీలో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే జట్లలో సౌతాఫ్రికా కూడా ఒకటిగా నిలుస్తోంది.

Advertisement