PMXI vs IND: ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై టీమిండియా ఘన విజయం
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ వార్మప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గులాబీ బంతితో ఆట జరిగింది. మొదటగా 50 ఓవర్లు నిర్ణయించగా, వరుణుడు ఆటలో అంతరాయం కలిగించడంతో 46 ఓవర్లకు ఆట సమయాన్ని కుదించారు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్ మొదట బ్యాటింగ్ చేసి 43.2 ఓవర్లలో 240 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్‌టస్ (107) తన అద్భుతమైన శతకంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ 240 పరుగుల లక్ష్యాన్ని 42.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (45), కేఎల్ రాహుల్ (27) శుభారంభం ఇచ్చారు
రాణించిన భారత బ్యాటర్లు
ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (50), నితీశ్ కుమార్ రెడ్డి (42), వాషింగ్టన్ సుందర్ (42) కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4/44తో దూసుకెళ్లాడు. ఆకాశ్ దీప్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హన్నో జాకబ్స్ (61) జాక్ క్లేటన్ (40) చెలరేగిన పోరాటం ప్రదర్శించారు. ఈ విజయంతో భారత్ 6 డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో డే/నైట్ టెస్టుకు సన్నద్ధంగా ఉంది.