Arjun Erigaisi: చెస్'లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్.. ప్రపంచ రెండో ర్యాంకు సాధించిన అర్జున్
ఇటీవలి కాలంలో 64 గళ్ల ఆటలో అద్భుత విజయాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకును అందుకున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ 2024లో గురువారం మూడో రౌండ్‌లో అర్జున్, రష్యా ఆటగాడు అలెక్సీ సరన్‌ను ఓడించి రెండో ర్యాంకుకు ఎగబాకాడు. ఈ టోర్నీలో అర్జున్‌కు ఇది రెండవ విజయం.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానం
ఈ విజయంతో అర్జున్ 2,805.8 ఎలో రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. యూఎస్‌ఏ ఆటగాళ్లు ఫాబియానో కరానా (2,805), హికారు నకముర (2,802)లను అధిగమించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ (2,831) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ (2,783) ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇటీవల 2,800 ఎలో రేటింగ్ సాధించిన అర్జున్, తన విజయాలతో అగ్రస్థానానికి దూసుకుపోతున్నాడు. ప్రపంచ రెండవ ర్యాంకు అందుకున్న అర్జున్ ఇరిగేసిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.