Sachin Tendulkar: పాకిస్థాన్‌పై ఆ ఇన్నింగ్స్ నా కెరీర్‌ను మార్చేసింది : సచిన్ టెండూల్కర్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌పై చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ ఇన్నింగ్స్ కంటే.. అదే పర్యటనలో పెషావర్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాక్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌లో తాను బాదిన సిక్సర్లనే అభిమానులు ఎక్కువగా గుర్తుంచుకున్నారని తెలిపాడు.
వివరాలు
25 బ్యాట్‌లతో 'బ్యాటోగ్రఫీ' విభాగం
ముంబయి క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన శరద్ పవార్ మ్యూజియంలో సచిన్ తన కెరీర్‌లో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన 25 బ్యాట్‌లతో రూపొందించిన 'బ్యాటోగ్రఫీ' విభాగాన్ని సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలోని ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నాడు.
వివరాలు
ఖాదిర్ సవాల్.. సచిన్ సిక్సర్లతో సమాధానం
వర్షం కారణంగా పాకిస్థాన్‌లో నేను ఆడాల్సిన తొలి మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన 25-30 వేల మందిని ఒక్క బంతీ చూడకుండానే వెనక్కి పంపడం ఎలా అని నిర్వాహకులు ఆలోచించారు.
దీంతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతావా అని నన్ను అడిగారు. అలా నా జీవితంలో తొలి టీ20 మ్యాచ్‌ను అనధికారికంగా ఆడాను.
మొదట ముస్తాక్ బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాను. ఆ తర్వాత అబ్దుల్ ఖాదిర్ నా దగ్గరకు వచ్చి.. 'ఒక కుర్రాడి మీద ప్రతాపం చూపిస్తున్నావు.
నా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టు' అని సవాల్ చేశాడు. నేను అలాగే చేశాను. మ్యాచ్ ముగిసిన తర్వాత ఖాదిర్ నన్ను అభినందించాడు.
వివరాలు
నేను కొట్టిన సిక్సర్లే ఎక్కువ
అది నా కెరీర్‌లో ఎంతో కీలకమైన సందర్భం. స్వదేశానికి తిరిగి వచ్చాక నేను బాదిన సిక్సర్లను అభిమానులు ఎంతో ఆస్వాదించారని తెలిసింది.
ఇదే పర్యటనలో నాలుగో టెస్టులో చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ ఇన్నింగ్స్ మా జట్టును సిరీస్ ఓటమి నుంచి తప్పించింది.
అయినప్పటికీ అభిమానులు మాత్రం నేను కొట్టిన సిక్సర్లనే ఎక్కువగా గుర్తుంచుకున్నారని సచిన్ వివరించాడు.