LOADING...
Alyssa Healy : చివరి వన్డేలో విజృంభించిన కెప్టెన్.. చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు ఇదే!
చివరి వన్డేలో విజృంభించిన కెప్టెన్.. చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు ఇదే!

Alyssa Healy : చివరి వన్డేలో విజృంభించిన కెప్టెన్.. చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ అలిస్సా హీలీ తన వన్డే కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. హోబర్ట్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఆమె అద్భుత ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇదే ఆమె కెరీర్‌లో చివరి వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హీలీ, భారత్‌తో కొనసాగుతున్న మల్టీ ఫార్మాట్ సిరీస్ అనంతరం శాశ్వతంగా ఆటకు వీడ్కోలు చెప్పనున్నారు. తన ఫేర్‌వెల్ వన్డేను మరపురానిదిగా మార్చుకున్న హీలీ కేవలం 79 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. మొత్తం 98 బంతులు ఎదుర్కొని 158 పరుగులు సాధించి భారత బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

Details

మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హీలీ బ్యాటింగ్‌కు మైదానంలోకి వస్తున్న సమయంలో భారత మహిళా క్రికెటర్లు రెండు వరుసలుగా నిలబడి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు గౌరవం తెలుపుతూ భారత జట్టు ప్రదర్శించిన ఈ సంస్కారం ప్రశంసలు అందుకుంటోంది. క్రీజులోకి వచ్చిన తర్వాత హీలీ తనదైన దూకుడు చూపించారు. ఆమె ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. స్నేహ రాణా వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ కావడంతో ఆమె మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. తన చివరి వన్డేలో శతకం సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా హీలీ ప్రత్యేక రికార్డు నెలకొల్పారు.

Details

టీ20ల్లో 3వేలకు పైగా పరుగులు

మరోవైపు, కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆమె భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన భార్య సెంచరీ కొట్టగానే ఆనందంతో మురిసిపోయారు. హీలీ ఫోర్ కొట్టి శతకం పూర్తి చేసిన క్షణంలో స్టార్క్ ముఖంలో కనిపించిన గర్వభావం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హీలీ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాకు అనేక విజయాలు అందించారు. 6 టీ20 ప్రపంచకప్‌లు, 2 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో ఆమె కీలక సభ్యురాలు. 2010లో 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హీలీ, వన్డేల్లో 3700కు పైగా పరుగులు, టీ20ల్లో 3000కు పైగా పరుగులు సాధించి మహిళా క్రికెట్‌లో తిరుగులేని లెజెండ్‌గా నిలిచారు.

Advertisement