LOADING...
RCB vs GT : ధర్మశాల పోరు హోరాహోరీ పోరు.. గుజరాత్‌ను ఓడించి ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందా?
ధర్మశాల పోరు హోరాహోరీ పోరు.. గుజరాత్‌ను ఓడించి ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందా?

RCB vs GT : ధర్మశాల పోరు హోరాహోరీ పోరు.. గుజరాత్‌ను ఓడించి ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో అత్యంత స్థిరమైన ప్రదర్శన చేసిన బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తొలి క్వాలిఫైయర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్ల కంటే పేస్ బౌలర్లకే ఎక్కువ సహకారం లభించే అవకాశముంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ విభాగంలో అద్భుతమైన గణాంకాలు నమోదు చేసింది. వారి పేస్ దళం 22.93 సగటుతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు సాధించింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో గుజరాత్ బౌలర్లు 30 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లను ప్రారంభంలోనే ఒత్తిడిలోకి నెట్టారు.

వివరాలు

ఫామ్ లో గుజరాత్ బౌలర్లు

కాగిసో రబడ 24 వికెట్లతో జట్టు బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తున్నాడు. మహ్మద్ సిరాజ్ కొత్త బంతితో పవర్‌ప్లేలో 8.76 ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్ గుజరాత్ బౌలింగ్ బలాన్ని మరింత పెంచుతున్నారు. మరోవైపు బెంగళూరు జట్టు బ్యాటింగ్ విభాగంలో విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు 164.13 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తోంది. ప్రతి 10.68 బంతులకు ఒక సిక్స్ బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తోంది. మిడిల్ ఓవర్లలో రజత్ పాటిదార్ 28 సిక్సర్లతో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

వివరాలు

పర్పుల్ క్యాప్ రేసులో భువనేశ్వర్ కుమార్

బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. పవర్‌ప్లేలోనే 15 వికెట్లు తీసి జట్టుకు కీలక బ్రేక్‌త్రూలు అందిస్తున్నాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో జోష్ హేజిల్‌వుడ్‌కు ఉన్న మంచి రికార్డు బెంగళూరుకు అదనపు బలంగా మారనుంది. ధర్మశాల మైదానంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆయన 53.66 సగటుతో పరుగులు సాధించాడు. గుజరాత్‌పై ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ 638 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

Advertisement

వివరాలు

గాయం కారణంగా సాల్ట్ దూరం

స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ 19 వికెట్లతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు సుయాష్ శర్మ స్థానంలో రిచర్డ్ గ్లీసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫింగర్ గాయం కారణంగా ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement