Asian Games 2026: పతకాల వేట షురూ.. గురి చూసి కొట్టిన భారత షూటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేటను ఘనంగా ప్రారంభించింది. షూటర్ ఇలవేనిల్ వలరివాన్ దేశానికి రెండు రజత పతకాలను అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఆమె సత్తా చాటింది. మరోవైపు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచిక తరియాల్ అనూహ్యంగా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరడంతో వరుసగా రెండో ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. హకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తదితర విభాగాల్లోనూ ఆదివారం భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేశారు.
వివరాలు
ఇలవేనిల్ రెండు రజతాలు
గత రెండు ఆసియా క్రీడల్లో పతకం లేకుండానే వెనుదిరిగిన ఇలవేనిల్ వలరివాన్ ఈసారి అద్భుతంగా రాణించింది. ఆదివారం మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకుంది.
ఇలవేనిల్ 252.4 పాయింట్లు సాధించింది. కేవలం 0.6 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన హినత తైచి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
దక్షిణ కొరియాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ బాన్ హ్యో-జిన్ 230.4 పాయింట్లతో కాంస్యం సాధించింది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లోనూ ఇలవేనిల్ రజతం సాధించింది.
సోనమ్, విదర్స వినోద్‌తో కలిసి బరిలోకి దిగిన ఆమె భారత జట్టును రెండో స్థానంలో నిలిపింది. భారత్ 1898.0 పాయింట్లు సాధించింది.
వివరాలు
సూపర్ సుచిక.. భారత్‌కు మరో పతకం ఖాయం
ప్రపంచ రికార్డు స్కోరు 1904.2 పాయింట్లతో చైనా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 1897.1 పాయింట్లతో జపాన్ కాంస్యాన్ని దక్కించుకుంది.
ఇలవేనిల్ రెండు పతకాలు సాధించినప్పటికీ.. ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది సుచిక తరియాల్.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా ఆమె పతకాన్ని ఖాయం చేసుకుంది. అయిచి-నగోయా ఆసియా క్రీడల్లోనే ఎంఎంఏ తొలిసారిగా భాగమైంది.
మహిళల 60 కేజీల క్వార్టర్‌ఫైనల్లో సుచిక 2-0తో మంగోలియాకు చెందిన బైగల్మాపై విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
36 ఏళ్ల సుచిక సోమవారం సెమీఫైనల్‌లో పోటీపడనుంది. ఈ ఈవెంట్‌లో సెమీఫైనల్లో ఓడిన ఇద్దరు క్రీడాకారిణులకు కాంస్య పతకాలు అందిస్తారు.
వివరాలు
మెరిసిన భారత షట్లర్లు
సుచికకు అంతర్జాతీయ స్థాయిలోనూ అనుభవం ఉంది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో జూడోలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2023 ఆసియా క్రీడల్లో కురాష్‌లో పోటీపడింది. 2024లో జియు-జిస్తు అనే మార్షల్ ఆర్ట్స్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన పోరులో కజకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసింది. పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మలు తమ తమ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. ముగ్గురూ ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారిణి పీవీ సింధు 21-7, 21-9తో కమిలపై విజయం సాధించింది.
వివరాలు
టేబుల్ టెన్నిస్‌లోనూ విజయం
ఆ తర్వాత ఉన్నతి హుడా 21-7, 21-10తో కులెషోవాను ఓడించింది. తన్వీ శర్మ 21-5, 21-10తో నమెనోవాపై గెలిచి భారత్‌కు 3-0 విజయాన్ని అందించింది. క్వార్టర్‌ఫైనల్లో భారత్ ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న ముగ్గురు క్రీడాకారిణులు యమగూచి (3వ ర్యాంక్), మియజాకి (7వ ర్యాంక్), ఒకుహర (10వ ర్యాంక్) జపాన్ జట్టులో ఉన్నారు.
టేబుల్ టెన్నిస్‌లో భారత మహిళల జట్టు గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో సింగపూర్‌పై 3-2తో విజయం సాధించింది. ఒక దశలో భారత్ 1-2తో వెనుకబడినా పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో యశస్విని విజయం సాధించింది.
వివరాలు
రిషబ్‌కు ఆరో స్థానం
ఆ తర్వాత శ్రీజ, దివ్య చితాలె తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. దీంతో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో శ్రీజ 6-11, 11-3, 11-7, 11-4తో జెంగ్ జియాను ఓడించి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చింది.
నిర్ణయాత్మక మ్యాచ్‌లో లాయ్ మింగ్‌పై యశస్విని విజయం సాధించడంతో భారత్ 3-2తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు భారత మహిళల జట్టు 3-0తో ఇండోనేసియాను ఓడించింది.
పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో భారత స్విమ్మర్ రిషబ్ దాస్ ఆరో స్థానంలో నిలిచాడు. అతడు 54.77 సెకన్లలో రేసును పూర్తి చేశాడు.
వుషులో పురుషుల చాంగ్‌కాన్ ఫైనల్లో సూరజ్ 11వ స్థానంలో నిలిచాడు. మరో భారత క్రీడాకారుడు విక్రాంత్ క్వార్టర్‌ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు.
వివరాలు
టెక్‌బాల్‌లో నిరాశ
టెక్‌బాల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కాంస్య పతకానికి చేరువైన క్విమ్సి డిసౌజా.. మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ కాంస్య పతక పోరుల్లో ఓటమి పాలైంది.
మహిళల సింగిల్స్‌లో క్విమ్సి 0-2 (11-12, 11-12)తో జపాన్‌కు చెందిన యిన చేతిలో ఓడింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో క్విమ్సి, అనాస్ బేగ్ జంట 0-2 (9-12, 6-12)తో వియత్నాం జోడీ చేతిలో పరాజయం పాలైంది.
లవ్లీనా, నరేందర్ నేరుగా క్వార్టర్స్‌లోకి
బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్, నరేందర్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. మహిళల 70 కేజీల విభాగంలో తొలి రౌండ్‌లో బై దక్కించుకున్న లవ్లీనా.. క్వార్టర్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన సుయాన్‌తో తలపడనుంది.
మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి తొలి పోరులో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఐరాతో పోటీపడనుంది.
వివరాలు
ఇవాళ భారత క్రీడాకారుల తలపడే సమయాలు ఇవే
షూటింగ్
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో హిమాన్షు థిల్లాన్, పార్థ్ రాకేశ్, రుద్రాంక్ష్ పాటిల్ ఉదయం 6.15 గంటల నుంచి బరిలోకి దిగనున్నారు.
పురుషుల స్కీట్ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో మైరాజ్ అహ్మద్, అనంత్‌జీత్, భవ్‌తేగ్ సింగ్ పాల్గొంటారు.
మహిళల స్కీట్ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో పరినాజ్, రైజా థిల్లాన్, మహేశ్వరి ఉదయం 6.30 గంటల నుంచి పోటీపడనున్నారు.
బ్యాడ్మింటన్
పురుషుల తొలి రౌండ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో ఉదయం 11.30గంటల నుంచి తలపడనుంది.
హాకీ
మహిళల పూల్-బి మ్యాచ్‌లో భారత్ ఇండోనేసియాతో ఉదయం 9.30 గంటల నుంచి ఆడనుంది.
కబడ్డీ
పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ జపాన్‌తో ఉదయం 9.45గంటలకు తలపడుతుంది. మహిళల జట్టు బంగ్లాదేశ్‌తో సాయంత్రం 4.15గంటలకు పోటీపడనుంది.
వివరాలు
టేబుల్ టెన్నిస్
మహిళల టీమ్ గ్రూప్-ఎఫ్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఉదయం 6.30 గంటలకు తలపడనుంది. పురుషుల టీమ్ గ్రూప్-ఎఫ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.
వుషు
మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి బంగ్లాదేశ్‌కు చెందిన శిఖతో మధ్యాహ్నం 3 గంటలకు పోటీపడనుంది.
పురుషుల 56 కేజీల విభాగంలో ఆర్యన్ అఫ్గానిస్థాన్‌కు చెందిన సఫితో మధ్యాహ్నం 3.50 గంటలకు తలపడనున్నాడు.
బాక్సింగ్
పురుషుల 70 కేజీల రౌండ్-32లో సుమిత్ థాయ్‌లాండ్‌కు చెందిన సిన్‌సిరితో ఉదయం 8.30 గంటలకు బరిలోకి దిగనున్నాడు.